నల్లగొండ జిల్లా:త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామశివారులోని డా.రెడ్డీస్ ల్యాబ్ విడుదల చేసే వ్యర్థ రసాయన పదార్థాలు పెద్దదేవులపల్లి( Peddadevulapally) రైతులకు చెందిన పంట కాలువ ద్వారా ప్రవహించి స్థానిక పొలాల్లోకి చేరి నిల్వ ఉండిపోతున్న విషయం రైతులు ఆలస్యంగా గుర్తించారు.
ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ల్యాబ్ యాజమాన్యం తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఫార్మాసిటీకి ఆనుకుని జాలు కాలువ ఉందని,ఆ జాలు కాలువ నీరు సాగర్ జాలలు ప్రవహించే ప్రధాన వాగులో కలుస్తుందన్నారు.
ఈ వాగు బాబుసాయిపేట,తుంగపహాడ్,మట్టూరు గుండా ప్రవహించి దామరచర్ల మీదుగా వాడపల్లి కృష్ణానదిలో కలుస్తుందని తెలిపారు.ఫార్మా వ్యర్థాలన్నీ గుట్టు చప్పుడు కాకుండా పక్కనే ఉన్నా జాలు కాలువలోకి విడిచిపెడితే సరిపోతుందిలే అనుకని ల్యాబ్ యాజమాన్యం ఈ దుర్మార్గానికి పాల్పడిందని ఆరోపిస్తున్నారు.
గతంలో ఇదే తరహాలో వ్యర్థ జలాలను( waste water) విడిచిపెట్టడంతో గత ఏడాది ఈ నీరు తాగి గేదెలు మృత్యువాత పడ్డాయని గుర్తు చేశారు.అయినప్పటికీ ల్యాబ్ యాజమాన్యంలో మార్పు రాలేదనన్నారు.
డా.రెడ్డీస్ వ్యర్థ జలాలతో చాలా ఇబ్బందులు వున్నాయని, నీరు పూర్తిగా కలుషితం కావడంతో పాటు పశువుల ప్రాణాలకు కూడా ముప్పు పొంచి వుందని,పశువులు తరచూ పంట కాలువల్లోకి దిగుతుంటాయని రైతులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఓ పక్క అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని,వ్యర్థ జలాలు సాగునీటి చెరువుల్లోకి విడిచిపెట్టడకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.