రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న జోగినపల్లి భాస్కర్ రావు( Joginapalli Bhaskar Rao) రూ.
ఏడు వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేష్ సుమారు రూ.
నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేలతో నిర్మించిన స్మశాన వాటిక కాంపౌండ్ వాల్ బిల్లు కోసం నాలుగు నెలలుగా తిప్పుతూ, చీఫ్ ప్లానింగ్ అధికారికి పంపించడం కోసం రూ.ఎనిమిది వేలు లంచం డిమాండ్ చేయడంతో వెంకటేష్ ఏసీబీని సంప్రదించినట్లు డీఎస్పీ వీవీ రమణమూర్తి తెలిపారు.కాగా సోమవారం ఏడు వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా భాస్కర్ రావు ను పట్టుకుని, కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు.అవినీతి అధికారులతో పీడించబడ్డ బాధితులు ఏసీబీ డీఎస్పీ 9154388954, సర్కిల్ ఇన్స్పెక్టర్లు 9154388955, 9154388956 నెంబర్లను సంపాదించాలని ఈ సందర్భంగా డీఎస్పీ రమణమూర్తి సూచించారు.