నల్గొండ జిల్లా:దేవరకొండ నియోజకవర్గ( Devarakonda ) కేంద్రంలో 167వ,జాతీయరహదారి( 167 National Highway)ని ఆనుకుని ఉన్న ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు వాహనాల పార్కింగ్ లేక వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.ఎక్సైజ్ పోలీసులు నల్లబెల్లం, నాటు సారా అక్రమంగా తరలించే వాహనాలను పట్టుకొని సీజ్ చేసి తమ స్టేషన్ పరిధిలో పార్క్ చేసేందుకు పార్కింగ్ లేకపోవడంతో రోడ్డు పక్కన పార్కింగ్ చేస్తున్నారు.
దానితో పక్కనే ఉన్న జాతీయ రహదారి వెంబడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని వాపోతున్నారు.నిత్యం రద్దీగా ఉండే రహదారి రాత్రి పగలు తేడా లేకుండా ఎన్నో వాహనాలు ఈ జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటాయని,ఏమాత్రం అదుపు తప్పినా ప్రమాదం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
అయినా సంబంధిత అధికారులు పట్టింపు లేకుండా సీజ్ చేసిన వాహనాలను రోడ్డు పక్కన పార్క్ చేయడంతో గతంలో దుర్గా పెట్రోల్ బంక్ సమీపంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ పోలీస్ స్టేషన్ జాతీయ రహదారిని ఆనుకొని మూలమలుపు ప్రదేశంలో ఉన్నందువలన వాహనాలు రోడ్డు వెంబడే నిలిపివేయడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని గతంలో ఎన్నో మార్లు అధికారులకు విన్నవించుకున్నా కూడా ఎలాంటి మార్పు లేదని ఆరోపిస్తున్నారు.
ప్రమాదం జరిగితే కానీ,అధికారుల్లో చలనం వచ్చేలా లేదని వాహనచోదకులు అంటున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు వెంబడి ఉన్న వాహనాలను తొలగించి ఎక్సైజ్ స్టేషన్ పార్కింగ్ ఏర్పాటు చేసి అందులో వాహనాలు నింపాలని వాహనదారులు కోరుకుంటున్నారు
.