ఖలిస్తానీ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య కేసుకు సంబంధించి ముగ్గురు అనుమానిత భారతీయులను కెనడా పోలీసులు అరెస్ట్ చేయడం దుమారం రేపుతోంది.ఈ పరిణామంపై కెనడా న్యూడెమొక్రాటిక్ పార్టీ (ఎన్‌డీపీ) నేత , భారత సంతతికి చెందిన జగ్మీత్ సింగ్( Jagmeet Singh ) స్పందించారు.
నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం వుందని ఆయన మరోసారి ఆరోపించారు.ఈ మేరకు జగ్మీత్ సింగ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
‘‘కెనడియన్ గడ్డపై ప్రార్థనా స్థలంలో కెనడా పౌరుడిని హత్య చేయడానికి భారత ప్రభుత్వం కిరాయి హంతకులను నియమించింది.ఈ రోజు 3 అరెస్ట్‌లు జరిగాయి.
ఇందుకు ఏ భారతీయ ఏజెంట్ ఆదేశించారో బహిర్గతం చేయాలి.నిజ్జర్‌కు న్యాయం జరగాలి ’’ అని ఆయన డిమాండ్ చేశారు.
నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయంపై కెనడియన్ పోలీసులు( Canadian Police ) ఎలాంటి ఆధారాలు చూపలేదు.ఈ క్రమంలో అరెస్ట్ అయిన ముగ్గురు భారతీయుల ఫోటోలను మాత్రం శుక్రవారం వారు విడుదల చేశారు.కరణ్ ప్రీత్ సింగ్,( Karanpreet Singh ) కమల్ ప్రీత్ సింగ్,( Kamalpreet Singh ) కరణ్ బ్రార్‌లను( Karan Brar ) అల్బెర్టా ప్రావిన్స్‌లోని ఎడ్మంటన్ సిటీలో అరెస్ట్ చేశారు.ఆర్‌సీఎంపీ (సర్రే)కి చెందిన ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్ఐటీ) శుక్రవారం ఉదయం ఎడ్మంటన్ పోలీస్ సర్వీస్ సాయంతో ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ముగ్గురిపై ఫస్ట్ డిగ్రీ హత్య, కుట్ర ఆరోపణలు వున్నాయి.వీరి ఫోటోలతో పాటు నిజ్జర్ హత్య సమయంలో నిందితులు ఉపయోగించినట్లుగా భావిస్తున్న కారు ఫోటోని కూడా పోలీసులు విడుదల చేశారు.నిజ్జర్ కేసు దర్యాప్తులో కెనడా భద్రతా యంత్రాంగం, ఆర్‌సీఎంపీ, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్‌పై తనకు పూర్తి విశ్వాసం వుందని కెనడా పబ్లిక్ సేఫ్టీ మినిస్టర్ డొమినిక్ లెబ్లాంక్ పేర్కొన్నారు.ఈ విచారణ ఇక్కడితో ఆగదని.
నిజ్జర్ హత్యలో కీలకపాత్ర పోషించిన మరికొందరు తమకు తెలుసునని ఐహెచ్‌ఐటీ ఇన్‌ఛార్జ్ మనదీప్ మూకర్ పేర్కొన్నారు.ప్రతీ ఒక్కరిని గుర్తించి అరెస్ట్ చేయడానికి తాము అంకిత భావంతో పనిచేస్తున్నట్లు మూకర్ తెలిపారు.
అరెస్ట్ అయిన ముగ్గురూ భారతీయ పౌరులని, గత మూడు నుంచి ఐదేళ్లుగా కెనడాలో శాశ్వత నివాసితులుగా జీవిస్తున్నారని మూకర్ చెప్పారు.గడిచిన కొన్నేళ్లుగా భారత్‌తో సమన్వయం సవాల్‌గానూ, చాలా కష్టంగానూ వుందని ఆయన పేర్కొన్నారు.
ఈ విషయంలో సిక్కు సమాజం మద్ధతుపై తన దర్యాప్తు ఆధారపడి వుందని మూకర్ వెల్లడించారు.