నల్లగొండ జిల్లా: ఎన్నికల హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం,లీక్,ఫేక్ కథనాలతో కాలం గడుపుతుందని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు.నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం ఎంపీ ఎన్నికల సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భగత్ తో పాటు ఎమ్మెల్సీ కోటిరెడ్డి హాజరు కాగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాసమస్యలు బయటికి రాకుండా ఫోన్ టాపింగ్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని,ఎప్పటికైనా తెలంగాణ హక్కుల కోసం పోరాడి,గొంతు ఎత్తి కొట్లాడేది కేసీఆర్ ఒక్కరేనని తెలిపారు.
కాంగ్రెస్ కు ఓటు వేసిన పాపానికి పల్లే పట్టణం తేడా లేకుండా ట్యాంకులతో నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.కొత్త ప్రభుత్వం అని కొంత సమయం ఇచ్చి చూశామని,ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎక్కడికక్కడ ఎండగడతామన్నారు.
బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతున్న నాయకులను ఉద్దేశించి ఒక్క నాయకుడు పోతే వంద నాయకులను సృష్టించే సత్తా కేసీఆర్ కు ఉందన్నారు.
ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్,బీజేపీ ఒకటేనని,వాటి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, రాబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పి,తెలంగాణ హక్కుల కోసం పోట్లాడే బీఆర్ఎస్ ను ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ జానయ్య, మండల రైతు బంధు సమితి నాయకులు అనుముల శ్యాంసుందర్ రెడ్డి,సీనియర్ నాయకులు అనుముల శ్రీనివాస్ రెడ్డి, వెంకటచారి,సత్యనారాయణ,కోటిరెడ్డి,మహిళ ప్రధాన కార్యదర్శి వనాజరెడ్డి, మాజీ సర్పంచులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.