యాదాద్రి భువనగిరి జిల్లా:భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ సంస్కృతి ప్రత్యేకత అని రాష్ట్ర నూతన గవర్నర్ సిపి రాధాకృష్ణ అన్నారు.రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బుధవారం రాత్రి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీపుష్పయాగ వేడుకలో పాల్గొన్నారు.యాదగిరిగుట్ట కొండపైకి మొదటిసారిగా వచ్చిన గవర్నర్ ను వీఐపీ అతిథి గృహం వద్ద సీఎస్ శాంతి కుమారి,జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండగే, డీసీసీ రాజేష్ చంద్ర, ఆలయ ఈవో భాస్కర్ రావులు స్వాగతం పలికారు.
ఆలయ తూర్పు త్రితల రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గవర్నర్ సిపి రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్నో శతబ్దాల ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సందర్శించడం సంతోషంగా ఉందని తెలిపారు.
స్వామివారి కృప తెలంగాణ ప్రజల మీద ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.యాదగిరిగుట్ట పునర్నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు.
భారతదేశంలో భిన్న సంస్కృతులు,కులాలు, భాషలు ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న ఆధ్యాత్మికతతో ప్రజలంతా ఒకటిగా ఉంటున్నారని, భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి ప్రత్యేకతని తెలిపారు.గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నానని, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.







