రాజన్న సిరిసిల్ల జిల్లా : ఈ వేసవిలో తాగునీటి సరఫరా పై పక్కా ప్రణాళిక ఉండాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ దాన కిశోర్ ఆదేశించారు.తాగునీటి సమస్య, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తదితర అంశాలపై రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, సీడీఎంఏ డైరెక్టర్ దివ్య దేవరాజన్ హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు(లోకల్ బాడీస్) ఉమ్మడి జిల్లాల ఈఈ లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం సమీక్షించారు.
ముందుగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో బాగంగా ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోని రాజకీయ పార్టీల బ్యానర్లు, క్యాలెండర్లు, ఫోటోలు, పోస్టర్లు 24 గంటల్లో తీసి వేయాలని, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇతర సంస్థల వద్ద ఉన్న వాటిని 48 గంటల్లో, ప్రైవేట్ స్థలాలోని వాటిని 72 గంటల్లో తొలగించాలని ఆదేశించారు.అన్ని కార్యాలయాల శుభ్రంగా ఉండాలని తెలిపారు.
సీఈఓకు పంపాలి
అలాగే ఇప్పటికే పరిపాలన అనుమతులు పొంది మొదలైన ప్రభుత్వ అభివృద్ది పనులు, పరిపాలన అనుమతులు పొంది ఇంకా మొదలు కాని పనుల వివరాలు సీఈఓకు పంపాలని సూచించారు.తాగునీటి సరఫరా పై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు.
నీటికి వనరులు ఎక్కడా ఉన్నాయి? వాటిలో నిల్వ ఎంత ఉన్నాయి? ప్రత్యామ్నాయలు (పవర్ బోర్లు, బావులు)ఏమి ఉన్నాయో చూసుకోవాలని సూచించారు.
అదనపు కలెక్టర్లు తమ పరిధిలోని మున్సిపాలిటీల్లో పర్యటించాలని ఆదేశించారు.
నీటి సరఫరా, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా అని పరిశీలించాలని తెలిపారు.సమ్మర్ యాక్షన్ ప్లాన్ తో సిద్దంగా ఉండాలని, మున్సిపాలిటీల్లో మైక్రో ప్లాన్ తో ఉండాలని వివరించారు.
బల్దియాల పరిధిలో ప్రతీ ఇంటికి, చివరి గృహాలకు తాగునీరు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.తాగునీటికి సంబంధించి చేపట్టే పనులకు ఎస్డీఎఫ్, బల్దియాల్లో జనరల్ ఫండ్ వాడుకోవాలని వెల్లడించారు.
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాపై దృష్టి పెట్టాలని, పక్కదారి పట్టకుండా చూసుకోవాలని సూచించారు.ఏదైనా క్రిటికల్ సమస్య ఉంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఇంకుడు గుంతలు నిర్మించాలి
వాన నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు నిర్మించాలనే విషయంపై అవగాహన కల్పించాలని పిలుపు నిచ్చారు.ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ఉండేలా చర్యలు తీసుకోవాలని వివరించారు.
నూతనంగా నిర్మించే భవనాలకు తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు లావణ్య, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.