నల్లగొండ జిల్లా:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ అధికారులు అరెస్ట్ చేస్తే తెలంగాణలో మీ లొల్లి ఏందని బీఆర్ఎస్ నేతలపై రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు.ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌కు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ అధిష్టానం ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ కేసుకు, తెలంగాణ ప్రజలకు ఏం సంబంధమని ప్రశ్నించారు.
కవితను అరెస్ట్ చేసింది ఢిల్లీ పోలీసులైతే తెలంగాణలో ధర్నాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని మండిపడ్డారు.నాడు చంద్రబాబు అరెస్టు సందర్భంగా తెలంగాణలో ధర్నాలను,ర్యాలీలు చేస్తుంటే ఆంధ్రాలో చేయాల్సిన నిరసనలు తెలంగాణలో ఎందుకని అడిగిన కేటీఆర్ ఇవాళ ధర్నాలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
పదేళ్ళు అధికారంలో ఉండి దోచుకున్న డబ్బుతో స్పెషల్ ఫ్లైట్లు బుక్ చేసి బీఆర్ఎస్ కార్యకర్తలను ఢిల్లీకి తీసుకపోయి ఈడీ ఆఫీసు ముందు ధర్నాలు, దీక్షలు చేసుకోండని సలహా ఇచ్చారు.ఎవడొస్తడో రండి చూసుకుందామని తొడలు కొట్టి,ఇప్పుడు వచ్చాక అమాయక కార్యకర్తలను రోడ్లమీదకి తేవడం ఎందుకని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పాలనతో ప్రజల జీవితాల్లో ఇప్పుడిప్పుడే వెలుగులు నిండుతున్నాయని,మళ్లీ మీ కుటిల రాజకీయాలతో తెలంగాణ ప్రజల్ని ఇబ్బందులు పెట్టకండని తెగేసి చెప్పారు.ఏపీ ముఖ్యమంత్రితో కుమ్మక్కై రాయలసీమకు నీళ్లివ్వడం మూలంగా ఇవాళ తెలంగాణ ప్రాజెక్టులన్నీ అడుగంటిపోయి రైతులు కరువుతో అల్లాడితోపోతుంటే మీ లిక్కర్ రాజకీయాలకు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చాలనుకుంటున్నారా? ఘాటుగా వ్యాఖ్యానించారు.