ఏఈవో ఉద్యోగాలకు మాకూ అవకాశం ఇవ్వండి:ఇంటర్ వృత్తి విద్యా క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అభ్యర్థులు

నల్లగొండ జిల్లా:ఇంటర్ ఒకేషనల్ కోర్సులో క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ పూర్తి చేసినవారు ప్రభుత్వ వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో)ఉద్యోగాలకు అర్హులని 1985 లోనే 428 జీవో కూడా జారీ చేశారు.కానీ,నేటికీ ఆ ఉత్తర్వులు అమలుకు నోచుకోకపోవడంతో ఏళ్ల తరబడి ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.

 Give Us A Chance For Aeo Jobs Inter Vocational Crop Production Management Candid-TeluguStop.com

అందరిలాగే తమకూ ఉద్యోగాలు వస్తాయని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారి సంఖ్య ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు వేల మంది ఉన్నామని బాధిత అభ్యర్దులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామీణ పేద విద్యార్థులకు ఆధునాతన సాంకేతిక వ్యవసాయ విధానాలను తెలియజేసే పాఠ్యాంశాలతో పాటు, సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు ఈ కోర్సును ప్రవేశపెట్టి,ఇప్పుడు ఈ కోర్సు చదివిన వారు ఉపాధికి అర్హులు కారంటూ దూరం చేస్తున్నారని అభ్యర్థులు వాపోతున్నారు.

క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఒకేషనల్ కోర్సును పూర్తిచేసిన అభ్యర్థులకు వ్యవసాయ శాఖలోని ఏఈఓ గ్రేడ్-2 ఉద్యోగాలకు అర్హులుగా పరిగణించాలని కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2011,జూలై 16న ఉత్తర్వులు జారీ చేసింది.కానీ,వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం దానిని అమలు చేయడంలో తాత్సారం చేస్తున్నారని అభ్యర్థులు పేర్కొంటున్నారు.

ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్) వంటి సంస్థలు క్రాప్ ప్రొడక్షన్ కోర్సును అర్హతగా పరిగణిస్తున్నా రాష్ట్ర వ్యవసాయ శాఖలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందంటున్నారు.ఇప్పటికైనా జీవో428 అమలు చేస్తూ ఏఈవో పోస్టులకు అర్హులుగా పరిగణించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అనే ఒకేషనల్ కోర్స్ ను తెలంగాణ రాష్ట్ర ఒకేషనల్ ఇంటర్మీడియట్ బోర్డు వారు అందింస్తుండగా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కోర్స్ ను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్నారు.ఈ రెండు కోర్సులు కూడా పదో తరగతి అనంతరం అందిస్తున్న రెండేళ్ల కాల పరిమితితో కూడిన కోర్సులే.

చట్టబద్ధంగా తమను కూడా అర్హులుగా పరిగణించాలని వోకేషనల్ అభ్యర్థులు కోరుతున్నారు.రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.2022లో విడుదల చేసిన జీవో 103 ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు ఐటీఐ, ఒకేషనల్ కోర్సుల వంటి డిప్లొమా కోర్సులు ఇంటర్మీడియెట్కి సమాన అర్హతగా పరిగణించాలని సూచించింది.ఈ ఉత్తర్వుల ప్రకారం ఒకేషనల్ ఇంటర్మీడియట్ వారు కూడా డిప్లొమాకి సమానం కాబట్టి ఏఈఓ గ్రేడ్-2 ఉద్యోగాలకు అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ వారు కూడా అర్హులవుతారని అభ్యర్థులు వాదిస్తున్నారు.

ఇటీవల మంత్రివర్గ సమావేశంలో చర్చకు రావడంతో ఈ పోస్టుల అర్హతలపై సందిగ్ధం నెలకొంది.ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్సు అయిన క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ను అర్హతల్లో పరిగణించాలని ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇటీవల కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ప్రజావాణిలో కలెక్టర్ కు సైతం తమసమస్యను విన్నవించారని,గతంలోని 428 జీవో ఉత్తర్వులు, రాష్ట్ర హైకోర్టు సూచనలు అనుసరించి వ్యవసాయ శాఖలోని ఉద్యోగాలకు మాకు అవకాశం కల్పించాలని,క్రాప్ ప్రొడక్షన్ కోర్సు చేసిన వారికి ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం ఎస్కే.రియాజ్ అంటుండగా,క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఒకేషనల్ అగ్రికల్చర్ కోర్స్ పూర్తి చేశాను.

వ్యవసాయ శాఖ నియామకాల్లో ఏఈవో గ్రేడ్-2 ఉద్యోగాలకు అర్హులైనా ఇప్పటివరకు మాకు అవకాశం కల్పించడం లేదు.ఇదే అంశంపై పలుమార్లు కోర్టుమెట్లు ఎక్కాం.తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులను కూడా కలిసి విన్నవిస్తున్నాం.మా అభ్యర్థులు ఆయా జిల్లాల కలెక్టరేట్లలో కూడా వినతిపత్రాలు సమర్పిస్తున్నారు.

జీవో 428 ప్రకారం ఏఈవో నియామకాల్లో అవకాశం కల్పించాలని కాసాని గోపినాథ్ కోరుతున్నారు.ఉపాధి అవకాశాలు లభించి జీవితంలో స్థిరపడతామన్న ఆశతో ఈ కోర్సును పూర్తి చేశామని, ఇప్పుడు అర్హులుకారని అధికారులు చెబుతున్నారని,పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని,ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అర్హులుగా పరిగణిస్తూ ఏఈవో గ్రేడ్ 2 పోస్టులకు అవకాశం ఇవ్వాలని రామాపురం దుంపటి గిరిజ,రాంపల్లి రాంబాబు వేడుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube