కొద్దిరోజుల క్రితం తాడేపల్లిగూడెంలో జనసేన, టిడిపి( Janasena, TDP ) ఉమ్మడిగా నిర్వహించిన జెండా సభ ఊహించని దానికంటే ఎక్కువ సక్సెస్ కావడంతో, రెండు పార్టీలు మంచి జోష్ లో ఉన్నాయి.అధికార పార్టీ వైసిపి బీసీలకు ఎక్కువగా టిక్కెట్లు కేటాయించడం, వారిని ఆకట్టుకునే విధంగా వారి మద్దతు ఉండేలా, అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో టిడిపి, జనసేనలు కూడా బీసీలను తమ వైపుకు తిప్పుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
దీనిలో భాగంగానే ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరి లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా భారీ బహిరంగ సభను నిర్వహించి, బిసి డిక్లరేషన్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఈ సభకు టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )హాజరుకానున్నారు.
దీంతో ఈ సభకు భారీగానే ఏర్పాట్లు చేశారు.
ఈరోజు నిర్వహించే జయహో బిసి సభ( Jayaho BC Sabha )కు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి బీసీలు, టిడిపి, జనసేన కార్యకర్తలు తరలి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు.బీసీలలో చేతివృత్తుల వారు ఎక్కువగా ఉన్నందున ఆయా వర్గాల అభ్యున్నతికి చేపట్టే చర్యలను ఈ సభలో ప్రకటించనున్నారు.ఈరోజు నిర్వహించే జయహో బిసి సభ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.
టిడిపి కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు( Yanamala Rama Krishnudu ) అధ్యక్షతన బీసీ డిక్లరేషన్ కమిటీ సమావేశం జరిగింది.
జనసేన, టిడిపి నేతలు ఇందులో సభ్యులుగా ఉన్నారు .బీసీలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ డిక్లరేషన్ ను ప్రకటించనున్నట్లు టిడిపి జనసేన నేతలు చెబుతున్నారు.బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంతో పాటు, బీసీ కుల గణనం, నిర్వహణకు సంబంధించిన అంశాలను కూడా డిక్లరేషన్ లో ప్రకటించే అవకాశం ఉంది.