రాజన్న సిరిసిల్ల జిల్లా : తాగు నీటి సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించామని అదనపు కలెక్టర్ పూజారి గౌతమి తెలిపారు.ఈ మేరకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని వివరించారు.
జిల్లాలోని ఆయా బల్దియాల పరిధిలో ప్రస్తుతం ఎక్కడా తాగునీరు సమస్య లేదని ఆమె స్పష్టం చేశారు.అంతకుముందు రానున్న వేసవిలో మున్సిపాలిటీల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులపై హైదరాబాద్ సీడీఎంఏ నుంచి డైరెక్టర్ దివ్య దేవరాజన్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు(స్థానిక సంస్థలు), మున్సిపల్ కమీషనర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం సమీక్షించారు.
మున్సిపాలిటీ ల పరిధిలో ఎక్కడా తాగునీరు సరఫరా లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
నీటి ట్యాంక్ ల నుంచి ప్రతీ ఇంటికి నీరు సరఫరా లో ఏమైనా లోపాలు ఉన్నాయో పరిశీలించాలని సూచించారు.
సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.బల్దియాల పరిధిలో చివరి గృహాలు, పైప్ లైన్ లేని, గుడారాలు వేసుకొని ఉండేవారికి కూడా నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని వివరించారు.
సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.బస్ స్టాండ్, మార్కెట్, ఇతర రద్దీ ప్రాంతాల్లో తాగునీటి వసతి కల్పించాలన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వడదెబ్బ నియంత్రణ మాత్రలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్దంగా పెట్టుకోవాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పారిశుధ్య పనులు నిత్యం చేయించాలని, ప్రతీ ఇంటి నుంచి చెత్తను ట్రాక్టర్లలో సేకరించాలని వివరించారు.
మొక్కల సంరక్షణ.మున్సిపాలిటీల ఆధ్వర్యంలో నర్సరీల్లో మొక్కలను సంరక్షించాలని డైరెక్టర్ దివ్య దేవరాజన్ ఆదేశించారు.ఉదయం, సాయంత్రం వేళల్లో మొక్కలకు నీళ్ళు పోసి కాపాడాలని సూచించారు.అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్లాస్టిక్, ఆయిల్ ఇండస్ట్రీ లు ఉంటే జాగ్రత్తలు తీసుకునేలా అగ్ని మాపక శాఖ అధికారులతో అవగాహన కల్పించాలని ఆదేశించారు.
అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై వివరించాలని తెలిపారు.పబ్లిక్ పార్క్ లలో మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని వివరించారు.
పక్షుల కోసం నీటిని అందుబాటులో ఉంచాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమీషనర్లు లావణ్య, అన్వేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.







