న్యూజెర్సీలోని( New Jersey ) ఒక భవనంలో భారీ అగ్నిప్రమాదం( Fire Accident ) చోటు చేసుకుంది.ఈ బిల్డింగ్‌లో డజను మందికి పైగా భారతీయ విద్యార్ధులు , నిపుణులు నివసిస్తూ వుండటంతో అమెరికాలో కలకలం రేగింది.
వెంటనే స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.గురువారం జెర్సీ సిటీలోని 77 నెల్సన్ అవెన్యూలోని( 77 Nelson Avenue ) ఈ బిల్డింగ్ కాంప్లెక్స్ బేస్‌మెంట్‌లో ప్రారంభమైన మంటలు నెమ్మదిగా మొదటి, రెండవ అంతస్తులకు ఆ వెంటనే పైకప్పుకు వ్యాపించాయని నగర అధికార ప్రతినిధి కింబర్లీ వాలెస్ స్కాల్సియోన్ పేర్కొన్నారు.
మంటలు చెలరేగడంతో పక్కనే వున్న మరో భవనం పైకప్పుకు కూడా నష్టం వాటిల్లింది.
ఈ ప్రమాదంపై న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా( Consulate General of India ) స్పందించింది.అగ్నిప్రమాదం కారణంగా ప్రభావితమైన భారతీయులకు సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.జెర్సీ సిటీలోని ఒక నివాస భవనంలో జరిగిన అగ్నిప్రమాదం గురించి సమాచారం అందినట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
భవంతిలో నివసిస్తున్న భారతీయ విద్యార్ధులు, నిపుణులు సురక్షితంగా వున్నారని.ఎవరూ గాయపడలేదని కాన్సులేట్ తెలిపింది.జెర్సీ సిటీలోని నెల్సన్ అవెన్యూలోని భవనంలో 11 మంది భారతీయ విద్యార్ధులు , ఒక జంట నివసిస్తున్నారని తెలుస్తోంది.
తాము విద్యార్ధులతో నిరంతరం టచ్‌లో వున్నామని .వసతి , ముఖ్యమైన పత్రాలు తదితర వాటితో సహా అన్ని సహాయాలను అందిస్తున్నామని కాన్సులేట్ కార్యాలయం తెలిపింది.ఈ ప్రమాదంపై నివేదికను సిద్ధం చేస్తామని జెర్సీ సిటీ అగ్నిమాపక విభాగం తెలిపింది.
ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారులు వెల్లడించలేదు.అమెరికన్ రెడ్‌క్రాస్ 14 మంది నివాసితులకు సహాయం అందించింది.
ఒక పిల్లిని కూడా భవనం నుంచి సురక్షితంగా రక్షించి దాని యజమానికి తిరిగి అప్పగించింది.అయితే ఈ భారీ ప్రమాదంలో నివాసితులు , అగ్నిమాపక సిబ్బందికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.