నల్లగొండ జిల్లా:వేసవి కాలం ప్రారంభం నుండే ఎండల తీవ్రత పెరగడంతో నల్లగొండ జిల్లా నాగర్జునసాగర్( Nagarjunasagar ) అమ్రాబాద్ ఫారెస్ట్ లో నీటి వనరుల కొరత ఏర్పడి అడవి జంతువులు దప్పికతో అలమటిస్తున్న నేపథ్యంలో ఫారెస్ట్ రేంజ్ లోని వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.వన్యప్రాణులకు వేసవి దాహార్తిని తీర్చడం కోసం అడవుల్లో కృత్రిమంగా నీటివనరులను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ అడవిలో సంచరుంచే రాకరకాల అడవి జీవుల కోసం ప్రత్యేకంగా నీటి గుంటలు, సోలార్ బోర్ వెల్స్ ఏర్పాటు చేశారు.వన్యప్రాణులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలు,నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించి వాటి నిర్మాణం చేపట్టారు.
నీటి వనరుల వద్ద వేటగాళ్ల ఉచ్చులకు ఫారెస్ట్ లో సంచరించే అడవి దున్న, ముళ్లపందులు,జింకలు,నీల్ గాయ్,దుప్పులు,అడవి కోళ్ళు,నెమల్లు,కుందేలు వంటి వన్యప్రాణులు బలికాకుండా ఉండేందుకు నిరంతరం గస్తీ,వాచ్ టవర్స్,కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేసినట్లు, వన్యప్రాణులకు అడవిలో నీటిని అందించడంతో నీటి జాడలు వెతుక్కుంటూ గ్రామాల్లోకి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని, నీటి లభ్యత ఉన్న చుట్టు పక్కల గడ్డి మొలిచి ఎండాకాలంలో ఆహార లభ్యత కూడా మెరుగయ్యే అవకాశం ఉంటుందని, వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.వన్య ప్రాణులకు ఎండాకాలంలో తాగునీటికి ఇబ్బంది ఏర్పడకుండా సాసర్‌పిట్‌లు ఏర్పాటు చేశామని ఫారెస్ట్ రేంజ్ ఎఫ్ఎస్ఓ రమేష్ తెలిపారు.
వాటిలో ట్రాక్టర్ల సాయంతో నీటితో నింపుతున్నామని,వేసవిలో అడవిలో సహజంగా ఉండే నీటి వనరులు ఎండిపోతాయని,దీంతో వన్యప్రాణులకు తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని,సాసర్ పిట్ల వద్ద కెమెరాలు అమర్చామని చెప్పారు.