సూర్యాపేట జిల్లా: నూతనకల్ మండల కేంద్రం నుండి అలుగునూరు గ్రామానికి వెళ్ళే రోడ్డుకు ఏళ్లు గడిచినా, పాలకులు మారినా మోక్షం మాత్రం కలగడం లేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు.గత ప్రభుత్వ హయాంలో 2021 లో ఈ రోడ్డు బీటీ పనులకు శంకుస్థాపన చేశారు.
పనులు మొదలు పెట్టిన కాంట్రాక్టర్ ఏమైందో ఏమో కానీ, మధ్యలోనే వదిలేసిపోయారు.అప్పటి నుండి దాని గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అంటున్నారు.784 మంది జనాభా కలిగిన ఈ గ్రామం లింగంపల్లి ఎక్స్ రోడ్ కు సుమారుగా 2 కి.మీ.దూరం ఉంటుంది.ఈ రెండు కి.మీ.వెళ్లాలంటే మాత్రం నరకం చూడాల్సి వస్తుందని,
ఈ ఊరు నుండి ఎక్కడికి వెళ్లాలన్నా ఎక్స్ రోడ్డు వరకు నడిస్తేనే ఏదైనా వాహన సౌకర్యం దొరుకుతుందని, కేవలం సొంత వాహనం కలిగిన వాహనాదారులు ఇబ్బంది లేకుండా వెళుతున్నారని, మిగతా వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మూడేళ్ళ క్రితం 3 కోట్ల 38 లక్షల వ్యయంతో రోడ్డుకి శంకుస్థాపన చేసి,సృజన కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ కు పనులు అప్పగిస్తే ఇప్పటి వరకు పత్తాలేడని ఆరోపిస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలో ఈ గ్రామస్తుల కల కలగానే మిగిలిపోయిందని, ఇప్పటికైనా రాష్ట్రంలో ప్రజా పాలన చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ చొరవ తీసుకుని అధికారులను,కాంట్రాక్టర్ ను ఆదేశించి బిటి రోడ్డు పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.