పెద్దవూర( Peddavoora ) పోలీస్ స్టేషన్ పరిధిలో గర్నెకుంట గ్రామంలో గత ఆగస్ట్ 28న జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.మంగళవారం విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాగర్ సర్కిల్ సిఐ బీసన్న, పెద్దవూర ఎస్‌ఐ రమేష్ అజ్మీరా నిందితుడి వివరాలు వెల్లడించారు.
గత సంవత్సరం ఆగష్టు 29 మధ్యాహ్న సమయంలో గర్నెకుంట గ్రామానికి చెందిన ఘనపురం లావణ్య ఇంట్లో ఎవరూలేని సమయంలో అనుముల గ్రామానికి చెందిన కూరాకుల మల్లయ్య(31) తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు చైన్,నల్లపూస గొలుసు,బంగారు కమ్మలు, జత మావిటీలు,మొత్తం 6 తులాల బంగారం,రూ.లక్ష నగదు చోరీకి పాల్పడ్డాడు.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా కారాకుల మల్లయ్య దొంగ తనం చేసినట్లు తేలడంతో అతని వద్ద నుంచి బంగారు నల్లపూస గొలుసు,జత మావటీలు మొత్తం 3తులాలను మరియు రూ.50వేలు నగదు స్వాధీనం చేశామని తెలిపారు.మిగతా మూడు తులాల బంగారం ఏపీజీవీబీ బ్యాంకు( APGVB Bank )లో తాకట్టు పెట్టినట్లు,50వేల రూపాయలు వాడుకున్నట్లు నిందితుడు తెలిపాడని అన్నారు.ఈ కేసు ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ రమేష్, కానిస్టేబుల్ శ్రీనివాస్, యోగి,కిషన్,రాజు,రవి, హోంగార్డ్స్ మధు,సైదులు, హుసియా నాయక్,రవి నాయక్,హనుమంతులను సీఐ బీసన్న ప్రత్యేక అభినందనలు తెలిపారు.