యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల ప్రజల విన్నపం మేరకు గతంలో హయత్ నగర్ డిపో వారు దిల్ సుఖ్ నగర్ నుండి సంస్థాన్ నారాయణపురం వరకు రెండు బస్సులు వేశారు.దీనితో ఇక పరిసర ప్రాంతాల ప్రయాణికుల కష్టాలు తీరాయనుకున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కలిపించడంతో అప్పటి వరకు నడిచిన బస్సులను నిలిపివేశారు.గతంలో మండల పరిసర ప్రాంతాలలో పని చేసే కార్మికులు,ఉద్యోగులకు,ఇక్కడి నుండి పట్నం వెళ్లేవారికి చాలా సౌకర్యంగా ఉండేది.
నడుస్తున్న బస్సులను ఆపేయడంతో మండల ప్రజలతో పాటు,పట్నం నుండి ఈ ప్రాంతానికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని సంస్థాన్ నారాయణపురం నుండి దిల్ సుఖ్ నగర్ వరకు పల్లె బస్సులను పునరుద్దరించాలని కోరుతున్నారు.
ప్రజల అవస్థలు దృష్టిలో పెట్టుకొని బస్సులు నడపాలని సోషల్ మీడియా కన్వీనర్ రాపర్తి ప్రదీప్ గౌడ్ అన్నారు.మా ఊరికి హైదరాబాద్ 50 కి.మీ.ప్రతి ఒక్కరూ గ్రామం నుండి పనులమీద పట్నం చేరుకోవాల్సిన పరిస్థితి.ఆటోలలో,బైక్ పై ప్రయాణం చేయాలంటే భయంగా ఉండడంతో ఆలస్యమైనా బస్సుల కోసం సేపు వేచి చూసి వెళ్ళేవారు.నడుస్తున్న బస్సులు రద్దు చేయడంతో ఉద్యోగాలకు,కళశాలకు వెళ్లే వారు,ఇతర పనులపై వెళ్ళి వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రద్దు చేసిన బస్సులను వెంటనే పునరుద్ధరించాలన్నారు.







