సూర్యాపేట జిల్లా: బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులు దివాలా తీసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక సంస్థలను బలపరుస్తామని రాష్ట్ర నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ఆదివారం హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి,మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో పర్యటించిన ఆయన పలు తండాలు,గ్రామాల్లో గ్రామ పంచాయతీ,అంగన్ వాడి భవనాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పీడ వదిలిందని అన్ని శాఖల ఉద్యోగులు భావిస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగులు స్వేచ్ఛగా పనిచేసుకోవాలన్నారు.
కమీషన్ల కోసమే గతంలో పంచాయితీల్లో ట్రాక్టర్లు కొనేలా చేశారని, సర్పంచుల పెండింగ్ బిల్లులపై మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు.మండల,మున్సిపల్,జిల్లా స్థానిక సంస్థల బలోపేతానికి కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమ పోలీస్ కేసులు ఉండబోవని స్పష్టం చేశారు.పేదల భూములు కబ్జా చేసిన బీఆర్ఎస్ నేతల నుండి భూములు వాపస్ చేస్తామని హామీ ఇచ్చారు.
పాత లిఫ్ట్ ఇరిగేషన్ పనులు 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.నూతన అంగనవాడి కేంద్రాల్లో టాయిలెట్ల కోసం మరికొన్ని నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
ప్రజా పాలనలో ప్రజలు స్వేచ్ఛగా జీవించాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.