నల్లగొండ జిల్లా: ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారడం లేదు.పాలకులు ఎవరైతే మాకేంటి మాదంతా పాత పద్ధతే అంటూ ప్రభుత్వ ఆస్తులను యధేచ్చగా కొల్లగొడుతున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ డ్యాంకు కూత వేటు దూరంలోని హైసెక్యూరిటీ జోన్లో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ (ఎన్నెస్పీ) భూమిని అప్పనంగా ఓ స్వచ్ఛంద సంస్థకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్న అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే… నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ పైలాన్ కాలనీలోని ప్రభుత్వ క్వార్టర్లను గతంలో మునిసిపాలిటీ, ఎన్ఎస్పీ అధికారులు ఓ స్వచ్ఛంద సంస్థకు ఇచ్చారు.
ఇపుడు ఆ సంస్థ భూమి కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేయడంతో ఫిల్టర్‌హౌస్ స్థలాన్ని అప్పగించేందుకు అంతా సిద్దం చేశారు.ప్రస్తుతం వారికి ఇస్తున్న భూమిలో పాత ఫిల్టర్ హౌస్ ఉంది.
హిల్‌కాలనీ వాసులకు తాగునీరు అందించేందుకు సుమారు రూ.కోటి వ్యయంతో మరో ఫిల్టర్ హౌస్ నిర్మించారు.
అది విఫలం కావడంతో కంట్రాక్టర్‌కు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు.దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది.కోర్టులో ఉన్న భూ వివాదాన్ని సైతం బేఖాతర్ చేస్తూ కబ్జాల పర్వానికి తెరలేపడం విస్మయానికి గురిచేస్తోంది.ఇదిలా ఉంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద తాగునీటిని అందించేందుకు రూ.40 కోట్లు మంజూరు చేసింది.ఆ నిధులతో వాటర్ ఫిల్టర్‌ను ఇదే ప్రాంతంలో నిర్మించాల్సి ఉంది.
ఈ లోగానే వాటర్ ఫిల్టర్ హోస్‌తో సహా ఆ భూమిని ఆ సంస్థకు 30 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు ఎన్నెస్పీ అధికారులు చర్యలు చేపట్టారు.కృష్ణానది తీరాన చాలా భూములు ఉన్నా అవేవి కాకుండా కోట్లాది రూపాయల విలువ చేసే ఈ భూమిని అప్పనంగా ఇచ్చేందుకు సిద్ధం చేయడమే విమర్శలకు తావిస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో అక్రమ భూకబ్జాలకు అధికారులు కూడా వంత పాడడంతో అడ్డూ అదుపూ లేకుండా కబ్జాల పర్వం కొనసాగింది.
నాటి పాలకుల బంధువులు నది తీరాన్ని ఆక్రమించి అక్రమకట్టడాలు కట్టడమే దానికి నిలువెత్తు నిదర్శనమని,ఈ తతంగంలో పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారడంతో అధికారులు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ అది నిజం కాకపోతే ఈ ప్రాంతంలో గత రెండు మూడేళ్లుగా అక్రమంగా కట్టడాలు నిర్మిస్తుంటే వివిధ శాఖల అధికారులు ఎందుకు చూస్తూ ఊరుకున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.పెద్ద మొత్తంలో లావాదేవీలు జరగడమే అధికారుల అలసత్వాన్ని కారణమని భావిస్తున్నారు.
అయితే ప్రభుత్వం మారగానే ఈ భూములపై మున్సిపల్ అధికారులు భూ అక్రమ మార్కులకు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ప్రభుత్వ భూములను కాపాడుతామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సాగర్ లో కృష్ణానది ఒడ్డున నిర్మాణం అవుతున్న అక్రమ కట్టడాలపై విచారణ చేయించి దోషులను శిక్షించి, ఆక్రమణకు గురవుతున్న భూములను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదే విషయమై సాగర్ డ్యాం సూపర్డెంట్ ఇంజనీరింగ్ నాగేశ్వరరావు ను వివరణ కోరగా నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ఫిల్టర్ హౌస్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదని చెప్పడం కొసమెరుపు.