నల్లగొండ జిల్లా:పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్న నినాదం కేవలం గోడల మీద రాతలకే పరిమితమైంది.గత రాష్ట్ర ప్రభుత్వం చెట్లను విరివిగా పెంచాలని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం లక్ష్యం నీరుగారుస్తూ విలువైన అటవీ సంపదను అక్రమంగా నరుకుతూ విచ్చలవిడిగా బొగ్గు బట్టిలు నిర్వహిస్తూ పచ్చదనాన్ని బుగ్గిపాలు చేస్తున్నా అటవీ శాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నల్లగొండ జిల్లా వేములపల్లి, మాడుగులపల్లి మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా కొందరు బొగ్గుల బట్టిలు నిర్వహిస్తున్నారు.బొగ్గు బట్టీలకు అటవీ,రెవెన్యూ, గ్రామ పంచాయతీ అనుమతులతో పాటు పర్యావరణకు హాని కలగని విధంగా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
కానీ,ఈ రెండు మండలాల పరిధిలో నిర్వహించే బొగ్గు బట్టీలకు ఎలాంటి అనుమతులు లేకున్నా సంబంధిత అధికారులు బొగ్గు బట్టీల( Coal furnaces ) వ్యాపారుల నుంచి ముడుపులు తీసుకుని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.గ్రామాల్లో సంబంధిత అధికారుల సహాయంతో కలపను నరుకుతూ బొగ్గు బట్టీలు నిర్వహిస్తూ లక్షలు సొమ్ము చేసుకుంటున్నారని,బొగ్గు బట్టీల నుంచి వెలువడే విషవాయువు,పొగతో ప్రజలు అనారోగ్యంతో భారిన పడటంతో పాటు వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని వాపోతున్నారు.
బొగ్గు బట్టిల నిర్వాహకుల నుంచి మామూళ్లకు అలవాటు పడే వారిపై చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బొగ్గుబట్టీలు నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
గ్రామాల్లో అక్రమంగా నడుపుతున్న బొగ్గు బట్టీలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని,చెట్లు లేకపోవడంతో సకాలంలో వర్షాలు కురవడంలేదని, పర్యావరణానికి కూడా హాని కలుగుతుందని అంటున్నారు.ఇకనైనా అధికారులు స్పందించి బొగ్గు బట్టిలపై తగిన చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాల్సిందే.