రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బి.వై.
నగర్ లోని సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్ మాట్లాడుతూ నిన్నటి రోజు పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం యజమాన్యం పాలిస్టర్ వస్త్ర పరిశ్రమను జనవరి 15 నుండి బందు పెడతామని వారు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని పరిశ్రమ నడిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని ప్రస్తుత పరిస్థితిలో పరిశ్రమ బంద్ నిర్ణయం సరియైనది కాదన్నారు.
ప్రభుత్వ ఆర్డర్లు బతుకమ్మ చీరలు ఉన్నంత సేపు నడిపించి అవి అయిపోగానే బందు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కార్మికులందరూ ఎక్కడికి పోవాలని ఏం చేసి బతకాలన్నారు.
వేలాది మంది కార్మికుల బతుకులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తుతుందని మార్కెట్ పరిస్థితి అనుకూలంగా లేకుంటే మార్కెట్ పరిస్థితి అనుకూలంగా వచ్చే వరకు రోజుకు ఒక షిఫ్ట్ అయినా పని కొనసాగించి కార్మికులకు ఉపాధి కల్పించాలి.
కానీ మొత్తానికి మొత్తం పరిశ్రమ బందు పెడితే కార్మికులతో ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని, యజమాలు తీసుకున్న నిర్ణయంపై సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్, చేనేత జౌలి శాఖ అధికారులు వెంటనే స్పందించి పరిశ్రమ నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈసమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు నక్క దేవదాస్ , నాయకులు బెజుగం సురేష్ , మోర తిరుపతి , దాసరి కుమార్ , సిఐటియు నాయకురాలు దాసరి రూప తదితరులు పాల్గొన్నారు.