సూర్యాపేట జిల్లా: వర్షాలు సరిగా పడక,నాగార్జున సాగర్ పూర్తిగా నిండక, ఆయకట్టుకు నీళ్లు విడుదల కాక ఇప్పటికే వానాకాలం సాగులో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ నేపథ్యంలో యాసంగిలో కూడా వరి పంటకు సాగర్ నీళ్లు రాకపోయినా బోర్లు, బావులు కింద కొద్దిపాటిగా వ్యవసాయం చేస్తున్నారు.
దీంతో సూర్యాపేట జిల్లాలో సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు కింద వరిసాగు విస్తరణ భారీగా తగ్గినట్లు కనిపిస్తుంది.
సాగర్ నీటి విడుదల లేకపోవడమే వరిసాగు తగ్గటానికి ప్రధాన కారణమని రైతులు వాపోతున్నారు.
వేసిన కొద్దిపాటి వరిసాగులో కూడా పంట చేతికి వచ్చేవరకు వేసవిలో బోర్లు,బావుల నీటి సామర్థ్యం సరిపోతుందో లేదోనని ఇప్పటినుండే రైతులు ఆందోళన చెందుతున్నారు.వరిసాగు తగ్గితే బియ్యం ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుందని, వ్యవసాయ కూలీలకు కూడా పనులు తగ్గాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
దీంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.