యాదాద్రి భువనగిరి జిల్లా: ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రంలో సుమారు ఏడేళ్ల క్రితం అప్పటి టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు యాస రంగారెడ్డి అధ్వర్యంలో యువకులు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.ఆలోచన తట్టిందే తడవుగా రంగారెడ్డి తన సొంత డబ్బులతో ఏర్పాట్లు మొదలు పెట్టారు.
డబ్బులు సరిపోకపోవడంతో కొద్ది మొత్తంలో విరాళాలు సేకరించి, సిమెంటు పిల్లర్ ఏర్పాటు చేసి దానిపై తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించారు.ఓపెనింగ్ కోసం విగ్రహంపై ముసుగు వేశారు.
కానీ,నేటికీ ఆవిష్కరణకు నోచుకోలేదు.కప్పిన ముసుగు ఎండకు ఎండి వానకు తడిసి చిరిగిపోతుందే తప్ప ఆవిష్కరణ చేయాలనే ఆలోచన చేసే వారే లేరని మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ నేతలకు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులకు గాని ముసుగు తొలగించాలనే ధ్యాసే లేకపోవడం గమనార్హం.ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు,రాజకీయ నాయకులు చొరవ తీసుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని కోరుతున్నారు.







