అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ) కీలక నిర్ణయం తీసుకున్నారు.కీలకమైన అయోవా కాకస్ సమావేశాలకు ముందు టీవీ ప్రకటనలను క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
కేబుల్ టీవీ ప్రకటనలపై వివేక్ తన ఖర్చును తగ్గించుకున్నారని అతని ప్రచార ప్రతినిధి తెలిపారు.రిపబ్లికన్ నామినేషన్ కోసం ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించే అయోవా కాకస్‌కు( Iowa caucuses ) కొన్ని వారాల సమయం మాత్రమే వుంది.
వివేక్ ప్రచార ప్రతినిధి ట్రిసియా మెక్‌లాఫ్లిన్ ( Tricia McLaughlin )మీడియాతో మాట్లాడుతూ.రామస్వామి తన మొత్తం ప్రకటనల బడ్జెట్‌ను తగ్గించడం లేదని, ఎక్కువ ప్రాధాన్యత గల ఓటర్లను ఆకట్టుకోవడానికి దానిని మళ్లిస్తామన్నారు.
గుర్తించిన ఓటర్లను బయటకు తీసుకురావడంపై దృష్టి కేంద్రీకరించామని.ఓటర్లతో కమ్యూనికేట్ చేయడానికి కావాల్సిన ప్రకటనలు, మెయిల్, టెక్ట్స్, లైవ్ కాల్‌లను ఉపయోగిస్తామని మెక్‌లాఫ్టిన్ చెప్పారు.అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటి వరకు చేసిన ఖర్చును కూడా ఆమె ప్రస్తావించారు.190 మిలియన్ డాలర్లను సాంప్రదాయ ప్రకటనల కోసం ఖర్చు చేసినట్లు చెప్పారు.అయితే యూట్యూబ్ టీవీ వంటి ఆన్‌లైన్ సేవల ద్వారా రామస్వామి ఇప్పటికీ కొన్ని ప్రకటనలను అమలు చేస్తున్నారని మెక్‌లాఫ్లిన్ వెల్లడించారు.

యాడ్స్‌లో లక్షలాది డాలర్లు పెట్టుబడి పెట్టిన రామస్వామి ఉన్నపళంగా తన ప్లాన్ మార్చారు.గత నెలలో అయోవాలో దాదాపు 1 మిలియన్ డాలర్ల విలువైన టీవీ ప్రకటనలను వివేక్ ప్రచార బృందం బుక్ చేసింది.భారీగా ఖర్చు పెట్టినా , తరచుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించినా రామస్వామి అయోవాలో పెద్దగా పట్టు సంపాదించలేకపోయారు.
ఇప్పటి వరకు తన ప్రచారానికి దాదాపు 20 మిలియన్ డాలర్లు ఖర్చు చేశానని గత నెలలో ఆయన మీడియాకు వివరించారు.

మరోవైపు.వివేక్ రామస్వామికి జనాదరణ తగ్గిపోతోంది.సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా రిపబ్లికన్‌లలో ఆయన పాపులారిటీ క్రమంగా తగ్గుతూ వస్తోంది.
తన ప్రచార ప్రసంగాలలో మితవాద కుట్ర సిద్ధాంతాలను కూడా ప్రచారం చేస్తున్నారు.జనవరి 6, 2021న కాపిటల్ భవనంపై దాడితో పాటు 2020 అధ్యక్ష ఎన్నికలను బిగ్ టెక్ రిగ్గింగ్ చేసిందని వివేక్ రామస్వామి ఆరోపించారు.







