యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్ ప్రాంతంలో వెలిసిన కెమికల్ ఫ్యాక్టరీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.జనావాసాల మధ్యలో నెలకొల్పిన శ్రీరాం కెమికల్ ఫ్యాక్టరీ,ఎంఎస్ఎన్ కెమికల్ ఫ్యాక్టరీ,మరో ఫ్యాక్టరీ నుండి విడుదలయ్యే వ్యర్థ పదార్థాలతో చెరువులు, భూగర్భ జలాలు కలుషితమై బోరు వేసినా కలుషిత నీరు రావడంతో కనీసం మంచి నీళ్ళు కూడా తాగే పరిస్థితి లేకుండా పోయిందని బీబీ నగర్ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
చెరువుల్లో నీళ్ళు పూర్తిగా కలుషితమై చేపలు, పశువులు సైతం చనిపోతున్నాయని,విషపూరితమైన నీళ్ళు తాగి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రజల ప్రాణాలను హరిస్తున్న కెమికల్ ఫ్యాక్టరీలను ఇక్కడి నుండి తరలించాలని ప్రజలు పోరాటాలకు సిద్ధమవుతున్నారు.
బీఆర్ఎస్ లీడర్లు కంపెనీల యాజమాన్యంతో కుమ్మకై ఈ కంపెనీలను పెంచి పోషించారు.ప్రజలు పడుతున్న ఇబ్బందులు వారికి పట్టలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాసుల ఆంజనేయులు గౌడ్ అన్నారు.
శ్రీరామ్ కెమికల్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున ఫైర్ జరిగినా మళ్లీ కంపెనీ కొనసాగిస్తున్నారని అధికారులు కూడా మామూళ్ల మత్తులో జోగుతూ చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు.ఈ కంపెనీలపై బీబీనగర్ ప్రజలు ఎన్నిసార్లు మెమోరండం ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని,బీఆర్ఎస్ సర్కార్ ఉండడం,ఈ కంపెనీల ఓనర్లు కూడా వాళ్లే కావడంతో జనం గోడు పట్టించుకున్న నాధుడే లేడన్నారు.
బీబీనగర్ ప్రజల కనీసం కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ కంపెనీలను జనావాసాల నుంచి తీసివేసి సుదూర ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తున్నరని, ఇప్పటికైనా ఈ కంపెనీలపై భువనగిరి యాదాద్రి జిల్లా కలెక్టర్ స్పందించి కంపెనీలు ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు.ప్రజల చేసే పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందన్నారు.







