నల్లగొండ జిల్లా: జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల కోడ్ ముగిసిన తెల్లారే బదిలీలు చేపట్టడంపై శాఖా ఉద్యోగులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.విద్యుత్ శాఖలో బదిలీలకు సంబంధించి నిషేధం ఉన్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా ముగ్గురు ఇంజనీర్లను బదిలీ చేయడం పలు విమర్శలకు తావిస్తోంది.
ఎస్ఈ నిబంధనలు తుంగలో తొక్కి తన ఇష్టారాజ్యంగా బదిలీ చేశారని విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.అసెంబ్లీ సాధారణ ఎన్నికల కోడ్ డిసెంబర్ 5వ తేదీన ముగిసిన మరుసటి రోజు ఉదయం బదిలీలకు తెరలేపారు.
విద్యుత్ శాఖలో బదిలీలకు సంబంధించి నిషేధం ఉన్నా కూడా బదిలీలు చేశారు.
నల్లగొండ ఎం అండ్ పిలో పనిచేసే ఏఈ అమర్ సింగ్ ను మిర్యాలగూడ రూరల్ ఏఈగా,సెలవులో ఉన్న ఏఈ అశ్వినిని నల్లగొండ ఎం అండ్ పి ఏఈగా, హాలియాలో సబ్ ఇంజనీర్ గా పనిచేసిన షఫీని నల్లగొండ కమర్షియల్ సబ్ ఇంజనీర్ గా పోస్టింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే చండూరులో పనిచేసే నాగయ్య రిటైర్మెంట్ కి దగ్గరలో ఉండి ఎప్పటి నుంచో నల్లగొండకు బదిలీ చేయాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.వాస్తవానికి రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
కానీ,సెలవులో ఉన్న ఏఈకి బదిలీ పోస్టింగ్ ఇవ్వడం పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే సాగర్ లో సబ్ ఇంజనీర్ గా చేసే ఉదయ్ కిరణ్ తనను నల్గొండకు బదిలీ చేయాలని గతంలోనే దరఖాస్తు చేసుకున్నా అతన్ని బదిలీ చేయకుండా హాలియా సబ్ ఇంజనీర్ గా పనిచేసే షఫీని నల్లగొండ కమర్షియల్ విభాగానికి బదిలీ చేయడం పట్ల ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
ఈ బదిలీల ప్రక్రియలో ముడుపుల వ్యవహారం నడిచి పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అత్యవసరంగా బదిలీల ప్రక్రియ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందని విద్యుత్ శాఖ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయంపై విద్యుత్ శాఖ ఎస్ఈని ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించకపోవడం గమనార్హం.
బదిలీలు కక్షపూరితంగా జరిగాయని గిరిజన సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు నాయక్ ఆరోపిస్తున్నారు.
విద్యుత్ శాఖలో అనుకోకుండా ఏమైనా ప్రమాదాలు జరిగితే ఉన్నతాధికారులు ఒక్కో ఘటనపై ఒక్కో విధంగా వ్యవహరిస్తూ గిరిజన ఉద్యోగుల పట్ల పక్షపాతంగా ఉంటున్నారని,కొన్నిచోట్ల ప్రమాదాలు జరిగిన సందర్భంలో కిందిస్థాయి ఉద్యోగుల మీద చర్యలు తీసుకుంటున్నారని, మిర్యాలగూడలో మాత్రం ఏఈని సరెండర్ చేయడం, నాంపల్లిలో పనిచేసే సబ్ ఇంజనీర్ ను చందంపేట ఏఈగా బదిలీ చేయడం కక్షపూరితమేనని అన్నారు.