సూర్యాపేట జిల్లా: నూతనకల్లు మండల కేంద్రం నుండి లింగంపల్లి, మిర్యాల, మాచనపల్లి మరియు చిల్పకుంట్ల, వెంకిపల్లి నుండి సంగెం గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వాన్నంగా తయారై ఎనిమిదేళ్లుగా ప్రజలు, ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.పాత రోడ్డు మొత్తం గుంతలు, కంకరతో ఉండడంతో ఎన్నికలు వస్తున్నందున 6 నెలల క్రితం అప్పటి ఎమ్మెల్యే హడావుడిగా శంకుస్థాపన చేశారు.
శంకుస్థాపన చేసిన నెల రోజుల తర్వాత రోడ్డు పనులు మొదలు పెట్టిన కాంట్రాక్టర్ పాత బిటి రోడ్డు తవ్వి కంకర పోశారు.
కంకర పోసి 5 నెలలు గడుస్తున్నా బిటి రోడ్డు మాత్రం పోయకుండా, పనులు కూడా సరిగ్గా చేయకపోవడంతో వివిధ గ్రామాల నుండి ప్రజలు మండలం కేంద్రానికి రావాలంటే తిప్పలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీసం టూ వీలర్,ఆటో కూడా తిరిగే పరిస్థితి లేదని, ఇప్పటికైనా అధికారులు, కాంట్రాక్టర్ స్పందించి త్వరగా రోడ్డు పోయాలని ప్రజలు కోరుతున్నారు.
కంకరపై ప్రయాణం కష్టంగా ఉందని లింగంపల్లి రాజేష్ అన్నారు.
మా ఊరు నుండి మండల కేంద్రానికి వెళ్లాలంటే చాలా ఇబ్బంది అవుతుంది.రోడ్డు సరిగా లేదు.
బైక్ పై వద్దామంటే ముందుకు కదలడం లేదు.సంవత్సరాలు నడవాల్సిన బైక్స్ నెలలకే పాడైపోతున్నవి.
ఆటోలు రావడం లేదు.వచ్చినా వాళ్ళు అధిక కిరాయిలు, చార్జీలు వసూలు చేస్తున్నారు.
లింగంపల్లి నుండి నూతనకల్లు రావాలంటే కనీసం 7 కి.మీ 40 నిముషాలు టైమ్ పడుతుంది.అధికారులు స్పందించి తొందరగా రోడ్డు వేయించగలరని కోరారు.