నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో సబ్ పోస్ట్ మాస్టర్ గా పని చేస్తున్న రామకృష్ణ ఖాతాదారుల నుండి నెలనెలా నగదు తీసుకొని ఖాతాలో జమ చేయకుండా చేతివాటం ప్రదర్శించి సుమారు రూ.70 లక్షలు స్వాహా చేసినట్లు బుధవారం చేసిన పోస్టల్ విచారణలో గుర్తించారు.ఇంకా విచారణ కొనసాగుతుంది.ఈ అవినీతికి కోటి రూపాయల వరకు దాటే అవకాశం ఉంటుందని, ఎంత మంది ఖాతాదారుల నగదు లూటీ అయ్యిందే అర్దంకాక అందరూ పరేషాన్ లో పడ్డారు.
ఈ బుధవారం పోస్ట్ ఆఫిస్ లో పోస్టల్ సర్వే సందర్భంగా వెలుగులోకి వచ్చింది.
గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో పోస్టల్ సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం తపాలా వ్యవస్థను తీసుకొచ్చింది.
పోస్టాఫీసు అంటే పల్లెల నుంచి నగరం వరకు ఏ చిన్న ఉత్తరం వచ్చినా భద్రంగా అందజేసి వ్యవస్థగా,నమ్మకానికి చిరునామాగా భావిస్తారు.ఆధునిక టెక్నాలజీ యుగంలో ఉత్తరాల పాత్ర దాదాపు కనుమరుగవడంతో తపాలా శాఖ బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టి, సేవింగ్స్,డిపాజిట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
తపాలా శాఖలో పొదుపు చేసే ఖాతాదారులంతా పేద, మధ్యతరగతికి చెందిన వారే ఎక్కువగా ఉంటారు.రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులతో భార్యాబిడ్డల బాగు కోసం,భవిష్యత్తు అవసరాల నిమిత్తం ఎక్కడ పొదుపు చేసినా నమ్మకం లేక తపాలా శాఖలోని వివిధ పాలసీల్లో పొదుపు చేసుకుంటారు.
వారి నమ్మకాన్ని వమ్ము చేశాడు పైలాన్ కాలనీ సబ్ పోస్ట్ మాస్టర్ రామకృష్ణ. ప్రతి నెలా నిర్ణీత గడువులో ఖాతాదారులు జమ చేసే సొమ్ముతో పాటు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన సొమ్మును కూడా తపాలా శాఖ ఖాతాకు కాకుండా తన సొంత ఖాతాకు మళ్లించి ఖాతాదారుల కడుపు కొట్టాడు.
పాస్ బుక్ లో నమోదు చేయకుండా తమను మోసం చేశాడని గ్రహించి పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా సంబధిత అధికారులు ఎవరూ పట్టించుకోలేదని డిపాజిట్ బాధితులు వాపోయారు.ఎలాగైనా తాము కష్టపడి కూడబెట్టిన డబ్బులు తమకు ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నారు.
ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టడానికి పోస్టల్ ఉన్నతాధికారులు నేడు పైలాన్ పోస్ట్ ఆఫీస్ కి రానున్నట్లు తెలుస్తోంది.
తీవ్ర ఆందోళనలో పైలాన్ పోస్టల్ ఖాతాదారులు.