సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) అధికారం వచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు అధికార పార్టీ ఆగడాలకు బలైన నేతలంతా బయటికొస్తూ రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది.ఆ క్రమంలోనే బీఆర్ఎస్( BRS ) కు చెందిన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబుపై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు 10 మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయ సూపరిండెంట్ వాజిద్ కు సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మాన నోటీసు అందించారు.
మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ కు సమానంగా కౌన్సిలర్ల బలం ఉండడంతో అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఎక్స్ అఫిషియోల్ ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకుంది.
తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మున్సిపల్ చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలతో తోటి కౌన్సిలర్లకు సరైన సహకారం అందించలేదని, ఏ తీర్మానానికైనా చైర్మన్ ఒక్కరే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ ముగ్గురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరారు.
దీనితో కాంగ్రెస్ కౌన్సిలర్ల( Congress councillors ) బలం పెరిగింది.చైర్మన్ మొండి వైఖరిపై 10 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసు ఇవ్వడంతో నేరేడుచర్ల మున్సిపల్ పాలకవర్గం హస్తగతం అయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే జరిగితే రాష్ట్రంలో అధికారం కోల్పోయి షాక్ లో ఉన్న గులాబీ పార్టీకి లోకల్ షాక్ తగలడం ఖాయమని తెలుస్తోంది.