2020లో ప్రపంచం మొత్తం కోవిడ్‌తో అల్లాడుతున్న వేళ అప్పటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్( British Prime Minister Boris Johnson ) తన సహచరులతో కలిసి 10 డౌనింగ్ స్ట్రీట్‌లో పార్టీ చేసుకున్న వ్యవహారం కలకలం రేపింది.అలాగే కోవిడ్‌ను సరిగా అంచనా వేయలేకపోవడంతో పాటు ఎదుర్కోవడంలోనూ జాన్సన్ సర్కార్ వైఫల్యం చెందిందని విపక్షాలు ఆరోపించాయి.
తాజాగా ఈ వ్యవహారంపై బహిరంగ విచారణ జరుపుతున్న కమిటీ ముందు బోరిస్ జాన్సన్ విచారణకు హాజరయ్యారు.చైనాలో వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తున్న సమయంలో తమ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జాన్సన్ అంగీకరించారు.
అయితే ఇందుకు తానొక్కడినే బాధ్యుడిని కాదని.మంత్రులు, ఉన్నతాధికారులు, సలహాదారుల బాధ్యత కూడా వుందని జాన్సన్ తెలిపారు.
కరోనా వైరస్ ( Corona virus )తీవ్రతపై వారు ప్రభుత్వాన్ని హెచ్చరించడంలో విఫలమయ్యారని మాజీ ప్రధాని పేర్కొన్నారు.2020 ఫిబ్రవరి నెలలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంపై ఐదు సమావేశాలు జరిగాయని, అందులో ఏ ఒక్కదానికీ తాను హాజరుకాలేదని జాన్సన్ వెల్లడించారు.కాకపోతే ఈ సమావేశాల మినిట్స్‌ను మాత్రం ఒకటి రెండు సార్లు చూశానని చెప్పారు.కరోనా బారినపడి దాదాపు 2,30,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.విచారణ సందర్భంగా బాధిత కుటుంబాలకు బోరిస్ జాన్సన్ క్షమాపణలు తెలిపారు.ఆ సమయంలో ఓ ఆందోళనకారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మీరు ఇప్పుడు చెప్పే క్షమాపణలు మరణించిన వారు వినగలరా అంటూ ఓ పోస్టర్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశాడు.దీంతో అతనిని భద్రతా సిబ్బంది బయటకు పంపించారు.

కాగా.కరోనా ఫస్ట్‌వేవ్ ఉద్ధృతంగా వున్న వేళ. ప్రపంచంలోని అన్ని దేశాలు కఠిన నిబంధనల్ని అమలు చేయాలని, లాక్‌డౌన్ విధించాలని నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ( World Health Organization ) హెచ్చరించాయి.సరిగ్గా బ్రిటన్‌లో కరోనా కేసులు పెరుగుతున్న 2020 జూన్‌లో జాన్సన్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని అధికార నివాసమైన 10-డౌనింగ్ స్ట్రీట్‌లో పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు.
ఆ పార్టీలో జాన్సన్ సహా ఉన్నతాధికారులు నిబంధనల్ని ఉల్లంఘించి పాల్గొన్నారు.

దీంతో ఆయన వైఖరిపై సొంత పార్టీ నేతలతో పాటు విపక్షాలు దుమ్మెత్తిపోశాయి.తద్వారా అధికారంలో ఉంటూ చట్టాన్ని ఉల్లంఘించిన తొలి ప్రధానిగా బోరిస్ జాన్సన్ అప్రతిష్టను మూటగట్టుకున్నారు.నిబంధనలు అతిక్రమించి పార్టీలో పాల్గొన్నందుకుగాను ఆయనకు 50 పౌండ్ల (భారత కరెన్సీలో రూ.5వేలు) జరిమానాను పోలీసులు విధించారు.అయితే తన పుట్టినరోజు వేడుకలతో పాటు కరోనా సమయంలోనే ప్రభుత్వ భవనాల్లో జరిగిన మరికొన్ని పార్టీలకూ బోరిస్ జాన్సన్ హాజరయ్యారన్న ఆరోపణలపై పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.
అంతిమంగా ఇవి బోరిస్ జాన్సన్‌ను పదవీచ్యుతుణ్ని చేశాయి.







