ఎట్టకేలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ( Revanth Reddy )బాధ్యతలు స్వీకరించబోతున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందనే ఉత్కంట కొనసాగినా, చివరకు మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ కు మద్దతుగా నిలబడడం , కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ వైపే మొగ్గు చూపించడంతో ఆయన పేరునే ప్రకటించారు.
తెలంగాణలో కాంగ్రెస్( Telangana Congress ) అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి చేసిన కృషి చాలానే ఉంది.పార్టీ సీనియర్ నేతలు తనను దూరం పెడుతూ వస్తున్న తనకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదులు చేసినా, రేవంత్ వారిని కలుపుకుని వెళ్లేందుకే చివరి వరకు ప్రయత్నించారు.
కాంగ్రెస్ అధిష్టానం పెద్దలలోనూ నమ్మకాన్ని కలిగించారు.ఆ నమ్మకంతోనే పూర్తి బాధ్యతలు రేవంత్ రెడ్డికి అప్పగించడంతో, రేవంత్ మరింత స్వేచ్ఛగా పనిచేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు.
ఇక రేవంత్( Revanth Reddy ) వ్యక్తిగత.రాజకీయ ప్రస్థానం గురించి చెప్పుకుంటే . 1969 నవంబర్ 8న రేవంత్ జన్మించారు .ఆయన సొంతూరు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి.తల్లిదండ్రులు నరసింహారెడ్డి ,రామచంద్రమ్మ.రేవంత్ కు ఆరుగురు అన్నదమ్ములు ఒక అక్క ఉన్నారు.వీరిలో రేవంత్ ఐదవ వారు .సొంత ఊరిలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు.ఆ తరువాత వెల్దండ మండలంలోని తాండ్రలో ఆరో తరగతి ,వనపర్తి లో హై స్కూల్ , ఇంటర్ పూర్తి చేశారు.ఆ తర్వాత హైదరాబాద్ లోని జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశారు.
డిగ్రీ చదువుకుంటూ ఉండగానే ఏబీవీపీ లోనూ పని చేశారు.అదే సమయంలో ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన జాగృతి పేపర్ లో పనిచేశారు.
ఆ తర్వాత కొంతకాలానికి సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ నడిపించారు.
ఇక రాజకీయ జీవితం గురించి చెప్పుకుంటే …2004లో రేవంత్ రెడ్డి( Revanth Reddy ) అప్పటి టిఆర్ఎస్ పార్టీలో చేరారు.2006లో మిడ్జిల్ మండలం జెడ్పిటిసి గా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నం చేశారు.అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో భాగంగా రేవంత్ కు టికెట్ దక్కలేదు.
దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రతిపక్షాలు మద్దతుతో విజయాన్ని సాధించారు.తర్వాత 2007లో స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.ఆ తర్వాత 2008లో టిడిపిలో రేవంత్ చేరారు.2009లో టిడిపి ( TDP )తరఫున కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.ఇక కాంగ్రెస్ లో రేవంత్ 2017 చేరారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు .ఆ తర్వాత 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి అప్పటి టిఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి పై 10,919 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.ఆ తర్వాత 2021 జూలైలో తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
ఇక కొద్ది రోజుల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ కొడంగల్ నుంచి రేవంత్ పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి పై 3200 మెజార్టీతో విజయం సాధించారు.ఇప్పుడు తెలంగాణ మూడో ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు.