నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి గురువారం జరిగిన ఎన్నికల పోలింగ్ శాతంలో నల్లగొండ,యాదాద్రి జిల్లాల ఉమ్మడి నియోజకవర్గమైన మునుగోడుకు ప్రథమ స్థానం దక్కింది.ఈ నియోజకవర్గంలో 2,52,648 మంది ఓటర్లకు గాను 2,31,197 మంది ఓటేయడంతో 91.51% తో రాష్ట్రంలోనే టాప్ లో నిలిచింది.డబ్బుల పంపిణీలోనూ మునుగోడే ప్రథమంగా నిలిచింది.రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో దేశవ్యాప్తంగా మునుగోడు నియోజకవర్గం పేరు మార్మోగిపోయిన విషయం తెలిసిందే.2022 ఉప ఎన్నికల సందర్బంగా ఇక్కడ విచ్చలవిడిగా డబ్బులు,మద్యం పంపిణీ జరిగింది.గురువారం జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా ఒక్కో ఓటుకు రూ.2000 నుంచి రూ.3000 వరకు పంపిణీ చేసినట్లు తెలుస్తుంది.ఇక్కడి నుండి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి(కాంగ్రెస్), కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (బీఆర్ఎస్),చలమల్ల కృష్ణారెడ్డి(బీజేపీ)తరుపున బరిలో ఉన్నారు.
భారీ ఎత్తున పోలింగ్ జరగడంతో ఎవరికీ అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందో అంచనా వేయలేకపోతున్నారు.ఏది ఏమైనా మునుగోడు ఓటర్లు చైతన్యమై భారీగా ఓటింగ్ లో పాల్గొనడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.