సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్(ఎస్) మండలం గట్టికల్ గ్రామంలో ఆదివారం రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో బీఎస్పీ సూర్యాపేట అభ్యర్ధి వట్టే జానయ్య యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా గ్రామానికి చెందిన మంత్రి జగదీష్ రెడ్డి( Minister Jagdish Reddy ) బంధువులు, బీఆర్ఎస్ నాయకులు సామ తిరుమల్ రెడ్డి, అఖిల్ రెడ్డి,రాజశేఖరరెడ్డి అధ్వర్యంలో గులాబీ కార్యకర్తలు వట్టే జానయ్య యాదవ్ పై గొడ్డళ్లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.దీనితో అప్రమత్తమైన బీఎస్పీ కార్యకర్తలు వట్టే చుట్టూ చేరడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
ఈ దాడిలో వట్టే ముఖ్య అనుచరుడికి తీవ్ర గాయాలయ్యాయి.దాడి ఘటనపై వట్టే పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ బీఎస్పీ శ్రేణులు,గ్రామస్తులు నిరసనకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
దీనితో గ్రామం మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొంది.రాజకీయ పరమైన వైరుధ్యాలు ఉంటే ప్రజా క్షేత్రంలో గెలిచి చూపించాలి కానీ,ఈ విధమైన భౌతిక దాడులకు దిగడం హేయమైన చర్యని బీఎస్పీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకూ మాటల యుద్ధంతో కొనసాగిన ఎన్నికల ప్రచారం ఈ ఘటనతో చేతల వరకూ వచ్చిందని,ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఘటనలు గొడ్డలి పెట్టు లాంటివని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.