తెలంగాణలో గెలుపు పై ఒకవైపు ధీమా ఉన్నా , మరోవైపు కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఆ పార్టీ చూపిస్తున్న దూకుడు తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్( BRS ) కు టెన్షన్ పుట్టిస్తున్నాయి.మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న కేసీఆర్ దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకున్నారు.
అన్ని పార్టీలకంటే ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు .అయితే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీలతో కాంగ్రెస్ ప్రభావం పెరిగినట్లుగా సర్వే నివేదికలలో వెళ్లడవ్వడం ఆందోళన పెంచుతుంది .కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) సమక్షంలో ప్రకటించిన హామీలు వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

ఇటువంటి హామీలతోనే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, తెలంగాణలోనూ ఆ స్థాయిలో ప్రభావం ఉండే అవకాశం ఉందని విశ్లేషణలు ఎన్నో తెరపైకి వస్తున్నాయి .ముఖ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ అమలు చేసిన 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ , మహిళలకు ప్రతినెల 2000 రూపాయల నగదు బదిలీ, ఉచిత బస్సు ప్రయాణం వంటివి తెలంగాణలోని ప్రభావం చూపించే అవకాశం ఉందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది.అంతేకాదు కర్ణాటకలో అమలు చేస్తున్నట్లుగానే తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

అర్హులైన మహిళలకు ప్రతినెల 2500 నగదు బదిలీ ,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 15 వేల రూపాయల రైతు భరోసా, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి 250 గజాల ఇంటి స్థలం, ఐదు లక్షల రూపాయల నగదు , రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ వంటి కాంగ్రెస్ హామీలు జనాల్లోకి బాగా వెళ్లాయి .అంతేకాదు అర్హులైన మహిళలకు 10 గ్రాముల బంగారం వంటివి ఓటర్లను బాగా ఆకర్షిస్తున్నాయి.ఇవే బీఆర్ఎస్ కు ఆందోళన కలిగిస్తోంది.ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి రావడంతో సహజంగానే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటుందని, దీనికి తోడు కాంగ్రెస్ ఇస్తున్న ఎన్నికల హామీలు తమ విజయవకాశాలను దెబ్బతీస్తాయని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది.
అందుకే కర్ణాటకలో కాంగ్రెస్ వైఫల్యలపై బీఆర్ఎస్ ప్రధానంగా దృష్టి సారించింది.ఈ మేరకు మంత్రి కేటీఆర్( KTR ) కర్ణాటక లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
కర్ణాటకలో ఉచిత కరెంట్ అక్కడ విద్యుత్ వ్యవస్థను నాశనం చేస్తోందని , జనం ఇబ్బంది పడుతున్నారని విమర్శిస్తున్నారు .కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి కుర్చీ కోసం నాయకులంతా తన్నుకుంటారని , తెలంగాణలో సుస్థిరత కరువు అవుతుందని కేటీఆర్( KTR ) హెచ్చరిస్తున్నారు.







