వైఎస్సార్ తెలంగాణ పార్టీ( YSR Telangana party ) పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు షర్మిల అనేక ప్రయత్నాలు చేశారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా, కాంగ్రెస్ లో తమ పార్టీని విలీనం చేసేందుకు ప్రయత్నించినా, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు మాత్రం షర్మిల డిమాండ్లకు అంగీకారం తెలపలేదు.తనకు పాలేరు అసెంబ్లీ( Paleru asembly ) టికెట్ తో పాటు తన అనుచరులకు కోరిన చోట టికెట్లు కేటాయించాలని , రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలనే షరతు విధించడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో , చివరకు కాంగ్రెస్ అధిష్టానం.
వెనక్కి తగ్గింది. షర్మిల పార్టీని విలీనం చేసుకునేందుకు కూడా అంగీకరించకపోవడంతో చివరకు కాంగ్రెస్ పై ఆగ్రహం చెందిన షర్మిల ఒంటరిగానే రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే దరఖాస్తులు స్వీకరణ కూడా మొదలుపెట్టారు .అయితే ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో 119 నియోజకవర్గాల్లో షర్మిల పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారా లేదా అనేది సందేహంగానే మారింది.

ఇది ఇలా ఉంటే కాస్తలో కాస్త షర్మిల కు ఊరట లభించే విధంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తులు కేటాయించింది.ఈ మేరకు తమ పార్టీకి ఉమ్మడి గుర్తు కేటాయించాలని షర్మిల ఎన్నికల సంఘాన్ని కోరింది. రిజిస్టర్ పార్టీగా ఉన్న వైయస్సార్ తెలంగాణ పార్టీ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం పేరా బి కింద అనుమతి ఇస్తూ ఆ పార్టీకి ఉమ్మడి గుర్తును కేటాయించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అభ్యర్థులకు బైనాక్యులర్ గుర్తు( Binocular )ను కేటాయించింది .నిబంధనలకు లోబడి ఆ పార్టీ అభ్యర్థులకు బైనాక్యులర్ గుర్తును కేటాయించాలని ఈసీ రిటర్నింగ్ అధికారులను ఆదేశించింది.

కాకపోతే ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో లేని నియోజకవర్గాల్లో మాత్రం ఇతర అభ్యర్థులు ఎంచుకునేలా ఫ్రీ సింబల్స్ జాబితాలో బైనాక్యులర్ గుర్తు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది .ఒకవేళ పార్టీ కనీసం ఐదు శాతం స్థానాల్లో అభ్యర్థులను నిలపకపోతే ఉమ్మడి గుర్తు అందుబాటులో ఉండదని ఎన్నికల సంఘం తెలిపింది.అలాగే తెలంగాణలోని కొన్ని రిజిస్టర్ పార్టీలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తును కేటాయించింది.







