తెలంగాణలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. నువ్వా, నేనా అన్నట్లుగా ప్రధాన పార్టీలన్నీ ప్రజలకు దగ్గర అయ్యేందుకు రకరకాల హామీలు ఇస్తూ ఎన్నికల ప్రచారానికి దిగుతున్నాయి .
ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికపైనే అన్ని పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన పూర్తికాగా , కాంగ్రెస్ మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది .ఇక బిజెపి నేడో రేపో మొదటి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.ఇదిలా ఉంటే అధికార పార్టీ బి ఆర్ ఎస్( BRS ) ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ( Telangana Congress )ఘనవిజయం సాధించాలంటే కర్ణాటక ఫార్ములానే అనుసరించాలని నిర్ణయించుకుంది.అంతేకాదు ప్రజాకర్షణ పథకాలను తమ మేనిఫెస్టోలో చేర్చి ప్రజలకు దగ్గర అవ్వాలని , ఓటర్ల చూపు కాంగ్రెస్ వైపే ఉండే విధంగా చేసుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది.
దీనిలో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టో పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తుంది.దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తయింది. మరో వారం రోజుల్లో లేదా ఈ నెలాఖరున కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది .గత నెల రోజులుగా టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ ఇదే పనిపై ఉంది నిన్న శనివారం కూడా గాంధీభవన్ లో ఈ కమిటీ చైర్మన్ , మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది .ఈ సమావేశంలో సభ్యులు సంభాని చంద్రశేఖర్( Sambani Chandrashekar ), చందా లింగయ్య, హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు కల్పన పైనే దృష్టి సారించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహించి పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు భర్తీ చేసే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని నిర్ణయించారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ( Telangana Congress )అన్ని విధాలుగా అండగా ఉంటుందనే భరోసా కల్పించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది.అలాగే గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు, వివిధ స్థాయిలోని ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లు, ఆర్టీసీ ఉద్యోగుల కోసం సరికొత్త పథకాలను మేనిఫెస్టోలో చేర్చేందుకు కసరత్తు చేస్తోంది.పూర్తిగా జనాకర్షణగా ఉండే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను తయారు చేస్తోంది.