ఇజ్రాయెల్, గాజాలలో నెలకొన్న దారుణమైన పరిస్తితుల గురించి ప్రపంచానికి తెల్సిందే.అయితే ఈ అనూహ్య పరిణామాలు పశ్చిమాసియా దేశాలలో ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయనే ఆందోళనలతో ఇపుడు చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి.ఈ నేపధ్యంలోనే అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 2.25 డాలర్లకు పైగా పెరిగి బ్యారల్ 86.90 డాలర్లకు ఎగిసింది.అమెరికాలో కూడా చమురు ధరలు భారీగా పెరిగాయి.
ఇజ్రాయెల్, పాలస్తీనాలు చమురు ఉత్పత్తి దేశాలు కావు.కానీ, ప్రపంచ చమురు సరఫరాలో మూడో వంతు పశ్చిమాసియా దేశాల నుంచే జరుగుతోంది.
కాబట్టే ఈ అనూహ్య పరిణామం.దశాబ్దాలుగా ఇరు పక్షాల మధ్య సాగుతోన్న ఘర్షణల్లో శనివారం ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడి( Hamas attack ) అతిపెద్దదిగా చెబుతున్నారు.

దాంతో పశ్చిమ దేశాలన్ని కూడా ఈ దాడులను చాలా తీవ్రంగా ఖండించాయి. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ అధికార ప్రతినిధి బీబీసీతో మాట్లాడుతూ, ఈ చర్యకు ఇరాన్ నుంచి తమకు ప్రత్యక్ష మద్దతు ఉందని తెలపడం కొసమెరుపు.ఇరాన్ ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటి.అయితే, ఇరాన్ మాత్రం ఈ దాడిలో తమ ప్రమేయం ఏమీ లేదని, న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి( United Nations Security Council ) సాక్షిగా బుకాయించింది, అది వేరే విషయం.
కానీ, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ( Ebrahim Raisi ) ఈ దాడికి మద్దతును ప్రకటించారు.

కాగా, ఈ హింసాత్మక దాడుల తర్వాత తమ దేశ ఉత్తర తీర ప్రాంతంలో ఉన్న తమర్ నేచురల్ గ్యాస్ ఫీల్డ్ లో అమెరికా ఆయిల్ దిగ్గజం చెవ్రాన్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఇజ్రాయెల్ ఆదేశించడం గమనార్హం.అంతేకాకుండా ఇజ్రాయెల్ ఇంధన అవసరాలకు ఇతర వనరుల నుంచి సరిపడ చమురు అందుబాటులో ఉందని ఆ దేశ ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది.సరిహద్దులో ఉన్న ఇరాన్, సౌదీ అరేబియా లాంటి అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి దేశాలకు ఈ దాడులు విస్తరిస్తాయేమోనని ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నట్లు ఎనర్జీ అనలిస్ట్ సౌల్ కవోనిక్ తాజాగా ఓ అంతర్జాతీయ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.







