తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.ఈ మేరకు విద్యార్థుల కోసం అల్పాహార పథకాన్ని తీసుకువచ్చింది.
ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని అమలు చేయనుంది సర్కార్.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 27,147 స్కూళ్లల్లోని 23 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని పొందనున్నారు.
ఇకపై రోజు స్కూల్ ప్రారంభానికి 45 నిమిషాల ముందు బ్రేక్ ఫాస్ట్ పెట్టనున్నారు.అయితే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు అల్పాహార పథకం అమలు కానుంది.
సాంబార్ -ఇడ్లీ, పూరీ -ఆలూ కుర్మా, ఉప్మా, వెజిటబుల్ పలావ్, ఉగ్గాని ఇలా రోజుకో బ్రేక్ ఫాస్ట్ అందించే విధంగా అధికారులు మెనూ రెడీ చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ప్రభుత్వ పాఠశాలలో ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ పథకాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్ రావు లాంఛనంగా ప్రారంభించారు.
ఇక రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అల్పాహార పథకాన్ని ప్రారంభించారు.







