గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయడంపై టీఎస్పీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు పిటిషన్ పై విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.
పరీక్షా నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీఎస్పీఎస్సీ డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం టీఎస్పీఎస్సీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.రూల్స్ మీరే ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించింది.
ఉద్యోగాలు రాక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న హైకోర్టు పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ ఎందుకు విఫలం అవుతోందని ప్రశ్నించింది.మొదటిసారి పేపర్ లీకేజీతో పరీక్ష రద్దు అయిందని, ఇప్పుడు నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహించారని మండిపడింది.
ఈ క్రమంలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ లో బయోమెట్రిక్ పెట్టకపోవడానికి కారణాలు ఏంటని ప్రశ్నించింది.దీనిపై ఉద్దేశ పూర్వకంగా ఏం చేయలేదన్న టీఎస్పీఎస్సీ దీని వలన విద్యార్థులకు ఎలాంటి నష్టం లేదని కోర్టుకు వెల్లడించింది.
ఈ కారణంగా పరీక్ష రద్దు చేయడం సరికాదని పేర్కొంది.ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.







