మానవ సంబంధాలు నానాటికీ దిగజారిపోతున్నాయి.ఇన్సూరెన్స్ సొమ్ము కోసం కట్టుకున్న వాళ్లను , తోబుట్టువులను, కన్నవారిని హత్య చేయిస్తున్నారు.
కాగా.దక్షిణాఫ్రికాలో భార్యను చంపేందుకు కుట్ర పన్నిన కేసులో 50 ఏళ్ల జైలు శిక్షకు గురైన భారత సంతతికి చెందిన మానసిక వైద్యుడు పెరోల్‌పై విడుదలైన నాలుగేళ్ల తర్వాత మరణించాడు.
మృతుడు ఒమర్ సబాడియా ( Omar Sabadia )(72) 1996లో తన భార్యను హత్య చేసేందుకు కుట్ర పన్నాడు.ఈ నేరానికి గాను 1998లో కోర్ట్ ఆయనకు 50 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సబాడియా లింపోపోలోని త్జానీన్‌లోని( Tzaneen, Limpopo ) ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు అధికారులు తెలిపారు.
1996లో సబాడియా తనను, తన భార్య జాహిదాను( Zahidan ) కిడ్నాప్ చేశారని ఆమెను కారులో ఎత్తుకెళ్లారని కట్టుకథలు చెప్పాడు.ఈ దంపతుల ముగ్గురు పిల్లలు తమ తల్లిని కనిపెట్టాలంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు.ఈ క్రమంలో ప్రిటోరియాకు ఉత్తరాన వున్న గా రంకువా బ్లాక్ టౌన్‌షిప్‌లో చెట్టుకు కట్టివేసిన స్థితిలో కుళ్లిపోయిన జాహిదా మృతదేహాన్ని దాదాపు 22 రోజుల తర్వాత కనుగొన్నారు.
జాహిదాను హతమార్చడానికి ముగ్గురు కిరాయి హంతకులను నియమించినట్లు సబాడియా నేరాన్ని అంగీకరించాడు.అనంతరం డిటెక్టివ్‌లను సంఘటనా స్థలానికి తీసుకెళ్లాడు.
జాహిదా హత్య జరిగిన రెండేళ్ల తర్వాత ట్రయల్ కోర్ట్ మేజిస్ట్రేట్ ( Trial Court Magistrate )దీనిని క్రూరమైన , అమానవీయమైనదిగా అభివర్ణించారు.ఈ నేరానికి గాను సబాడియాకు 50 ఏళ్ల జైలు శిక్ష విధించారు.ఆపై కిరాయి హంతకులు ఆల్బర్ట్ మోకెట్సాన్, రిచర్డ్ మలేమా, పాట్రిక్ మాన్యపేలు జాహిదాను హత్య చేయడానికి సబాడియా తమతో డీల్ చేసుకున్నాడని అంగీకరించారు.జాహిదా మరణంతో ఆమె పేరిట వున్న దాదాపు 2 మిలియన్ డాలర్ల విలువైన బీమా పాలసీని సబాడియా పొందగలిగాడు.
ముగ్గురు హంతకులకు కోర్టు 25 నుంచి 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది.అయితే వీరికి తర్వాతి కాలంలో పెరోల్ మంజూరు చేయబడింది.సబాడియాకు కూడా 2019లో పెరోల్ మంజూరైంది.ఇందుకు అతని పిల్లలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తల్లి మరణం, తండ్రి జైలు పాలవ్వడంతో ముగ్గురు పిల్లలు జాహిదా తల్లిదండ్రుల వద్ద పెరిగారు.