ఉత్తర ఆఫ్రికా దేశం మొరాకోలో భారీ భూకంపం సంభవించింది.భూ ప్రకంపనల తీవ్రతతో పెద్ద పెద్ద భవనాలు సైతం నేలమట్టం అయ్యాయి.
ఇప్పటికే 632 మంది మృత్యువాత పడగా మూడు వందల మందికిపైగా గాయపడ్డారని ప్రభుత్వం వెల్లడించింది.ధ్వంసమైన భవనాల శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
ఓ వైపు సహాయక చర్యలు కొనసాగుతుండగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.కాగా మర్రకేష్ కు నైరుతి దిశలో సుమారు 71 కిలోమీటర్ల దూరంలో 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.ఇప్పటికే ఈ భూకంప ఘటనపై యావత్ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
అదేవిధంగా విచారం వ్యక్తం చేసిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.గాయపడిన వారు కోలుకోవాలని ఆకాంక్షించిన మోదీ మొరాకో ప్రజలకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని వెల్లడించారు.







