నల్లగొండ జిల్లా:ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి,అమలు చేయడం,వాటి ద్వారా ఓట్లు కొల్లగొట్టి తిరిగి అధికారంలోకి రావాలని కలలు కనడం ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ( Political system )యొక్క సర్వసాధారణ ప్రక్రియగా అందరికీ తెలిసిందే.ఏ పార్టీ ప్రభుత్వమైనా సంక్షేమ పథకాలను అధికార యంత్రాగం ద్వారా అమలు చేస్తూ,ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రజలకు అందేలా, చూస్తుంది.
తద్వారా పథకాల అమలు తీరులో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుంది.ప్రజలు కూడా అందినా అందకపోయినా కొంత వరకు సర్డుకుపోతారు.
కానీ,తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు ప్రక్రియలో అధికార యంత్రాంగం యొక్క పాత్ర శూన్యమనేది బహిరంగ రహస్యమే.ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏ పథకమైనా స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఆయన చెప్పిందే వేదంగా అమలు జరగడం,ఇదే అదనుగా అధికార పార్టీ మండల స్థాయి నేతలు, చోటా మోటా నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేలను సైతం తప్పుదారి పట్టిస్తూ తాము చెప్పిన వారికే లబ్ది చేకూరే విధంగా చేయడంతో మండల స్థాయి అధికారులు ప్రేక్షకపాత్రకు పరిమితమై ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పట్టి, ప్రజల్లోనూ,సొంత పార్టీ శ్రేణుల్లోనూ కూడా తీవ్ర వ్యతిరేకత పెరుగుతుంది.
ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఏకపక్ష నిర్ణయాలతో లబ్ధిదారుల ఎంపిక చేస్తూ అనర్హులకు పట్టం కడుతూ అర్హులకు అన్యాయం చేస్తున్నారన్న విషయం ప్రజలను,సొంత పార్టీలోని కొందరు నేతలను సైతం ఇబ్బందులకు గురి చేస్తుందనే వాదన బలంగా ఉండడంతో మెజార్టీ స్థానాల్లో సిట్టింగ్ లకు ఈ సారి టిక్కెట్ రావడం కష్టమనే భావన నెలకొంది.అయినా ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని 12 మంది సిట్టింగ్ లకే సీఎం కేసీఅర్ టిక్కెట్ ఇస్తున్నట్లు ప్రకటించడంతో అందరూ షాకయ్యారు.
టిక్కెట్ ఖరారు కావడంతో సిట్టింగ్ లంతా తమ ప్రభుత్వం అమలు చేసిన,చేస్తున్న సంక్షేమ పథకాలను ఏకరువు పెడుతూ ప్రజా క్షేత్రంలోని వెళ్తున్నారు.దాదాపు జిల్లాలో అందరూ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గంలో పర్యటిస్తూ దళిత బంధు, బీసీ బంధు,మైనార్టీబంధు, గృహలక్ష్మి,పోడు భూముల పట్టాలు వంటి ప్రభుత్వ ప్రధాన పథకాల లబ్ధిదారులే లక్ష్యంగా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారీగా శ్రమిస్తున్నారు.
ఆ సంక్షేమ పథకాల అమలు చేసే తీరే ఇప్పుడు వారి మెడకు చుట్టుకునే ప్రమాదం ఏర్పడిందని పార్టీలోని అసంతృప్త నేతల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వ పథకాల పంపిణీలో జరిగిన అనేక అవకతవకలు వారికి కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయని,అందిన వారు జై కొడుతుంటే, అర్హులైనా అందకుండా ఉన్నవారు,అసలే పట్టించుకొని వారు ఎమ్మెల్యేలకు నై కొడుతూ ఎక్కడికక్కడ నిలదీస్తూ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
అందులో సొంత పార్టీ శ్రేణులే అధికంగా ఉండడం గమనార్హం.కొన్ని నియోజకవర్గాల్లో టిక్కెట్ ఖరారు చేసినా సరే సీఎం కేసీఅర్ పునరాలోచన చేయాలని,లేకుంటే ఓడిస్తామంటూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే పరిస్థితి ఏర్పడింది.
ప్రజల సంక్షేమం కోసం తెచ్చిన పథకాలే ఎమ్మెల్యేల పతనానికి కారణమవుతున్నయనే విషయాన్ని ఎమ్మెల్యేలు గ్రహించకపోవడంతో టిక్కెట్ ఖరారైనా బి ఫారం వస్తుందనే నమ్మకం లేదని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.ఏది ఏమైనా ప్రభుత్వం అరాకొర పథకాల పంపిణీతో ముందుకు పోతే గొయ్యి వెనక పోతే నుయ్యిలా ఎమ్మెల్యేల పరిస్థితి మారిందని ఈ పథకాలు మమ్ముల్ని ముంచేనా లేక తేల్చేనా అని లోలోన మదన పడుతున్నట్లు తెలుస్తోంది…!!
.