ఆంధ్రప్రదేశ్ లోని వైయస్సార్ స్టేడియం( Dr.Y.S.Rajashekar Stadium ) వేదికగా జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-2( Andhra Premier League season2 ) విజేతగా రాయలసీమ కింగ్స్ నిలిచింది.తాజాగా ఆదివారం కోస్టల్ రైడర్స్- రాయలసీమ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వీజేడి(వి జయదేవన్ సిస్టమ్) పద్ధతిలో రాయలసీమ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడం వల్ల వీజేడీ పద్ధతిన ఫలితాన్ని తేల్చారు.
ఈ మ్యాచ్ లో తోలుత బ్యాటింగ్ చేసిన కోస్టల్ రైడర్స్ నిర్ణీత 18 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.మద్దిలవర్ధన్ 50 పరుగులు, ధరణి కుమార్ 30 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడారు.
రాయలసీమ బౌలర్లైన ఎస్ కే కమ్రుద్దీన్ 3 వికెట్లు, హరిశంకర్ రెడ్డి రెండు వికెట్లు, జాగర్లపూడి రామ్, బోదల కుమార్, హనుమ విహారి చెరో వికెట్ తీశారు.

అనంతరం లక్ష్య చేధనకు దిగిన రాయలసీమ కింగ్స్ 16.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి వీజేడీ పద్ధతిలో టైటిల్ గెలిచింది.రాయలసీమ కింగ్స్ ఆరంభంలో పేలవ ఆట ప్రదర్శన చేసింది.
ఓపెనర్లు కోగటమ్ రెడ్డి (0) గోల్డెన్ డకౌట్ అయ్యాడు.వంశీ కృష్ణ 3 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు.
తోట శరణ్ 24 పరుగులకే పెవీలియన్ చేరడంతో రాయలసీమ కింగ్స్ 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

అయితే కెప్టెన్ హనుమ విహారీ 46 నాట్అవుట్( Hanuma Vihari ), బోదల కుమార్ 53 పరుగులతో జట్టును ఆదుకున్నారు.గిరినాథ్ రెడ్డి 29 (నాట్ అవుట్) సాయంతో హనుమ విహారి జట్టుకు విజయాన్ని అందించాడు.కోస్టల్ రైడర్స్ బౌలర్లైన చీపురుపల్లి స్టీఫెన్, ఆశిష్ చెరో రెండు వికెట్లు తీయగా.షేక్ అబ్దుల్లా ఒక వికెట్ తీశాడు.ఈ ఫైనల్ మ్యాచ్ కు బీసీసీఐ మాజీ సెలెక్టర్, దిగ్గజ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై ప్రశంసల జల్లు కురిపించాడు.







