ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా విడుదలైన గ్రూప్1 ఫలితాల్లో లక్ష్మీ ప్రసన్న( Lakshmi Prasanna ) మూడో ర్యాంక్ సాధించారు.లక్ష్యాన్ని సాధించడంలో ఎన్నో అవరోధాలు ఎదురైనా లక్ష్మీ ప్రసన్న మాత్రం తన కష్టంతో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.
లక్ష్మీ ప్రసన్న తండ్రి సామాన్య బస్ కండక్టర్ కాగా కడప జిల్లాలోని నందలూరు మండలంలోని టంగుటూరు గ్రామం ఈమె స్వస్థలం.పది వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న లక్ష్మీ ప్రసన్న ఇంటర్ శ్రీ చైతన్య కాలేజ్ లో చదివారు.
రాజంపేటలోని అన్నమాచార్య కాలేజ్ లో బీటెక్ పూర్తి చేసిన లక్ష్మీ ప్రసన్న ఆరేళ్ల క్రితమే అక్క లావణ్య గ్రూప్1లో ర్యాంక్ కొట్టి డీఎస్పీగా పని చేస్తుండటంతో ఆమెను స్పూర్తిగా తీసుకున్నారు.లక్ష్మీ ప్రసన్న అక్క లావణ్య ప్రస్తుతం తిరుపతిలోని ఏపీ ట్రాన్స్ కోలో చీఫ్ విజిలెన్స్ అధికారిగా పని చేస్తున్నారు.
లక్ష్మీ ప్రసన్న రెండో అక్క మాధవి ప్రస్తుతం ఏపీ టిడ్కోలో పని చేస్తున్నారు.ఆమె కూడా గ్రూప్1 లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో కష్టపడుతున్నారు.

మూడో కూతురు లక్ష్మీ ప్రసన్న 2014 సంవత్సరం నుంచి సివిల్స్ కోసం మూడుసార్లు ప్రయత్నించారు.కానీ సక్సెస్ కాలేదు.2019 సంవత్సరంలో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించిన లక్ష్మీ ప్రసన్న ప్రస్తుతం టీవీ పురం విలేజ్ లో పని చేస్తున్నారు.గ్రూప్1 పరీక్షలో మూడో ర్యాంక్ రావడంతో లక్ష్మీ ప్రసన్న ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఒకవైపు జాబ్ చేస్తూనే మరోవైపు కోచింగ్ తీసుకుని లక్ష్మీ ప్రసన్న పరీక్షల్లో విజేతగా నిలిచారు.

లక్ష్మీ ప్రసన్న భర్త చంద్రదీప్ ( Chandradeep )అనంతపూర్ లోని ఎల్లనూరు మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నారు.ముగ్గురు కూతుళ్లను కష్టపడి చదివించి ప్రయోజకులను చేసిన లక్ష్మీ ప్రసన్న తల్లీదండ్రులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.లక్ష్మీ ప్రసన్న సక్సెస్ విషయంలో తల్లీదండ్రుల కృషిని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







