ఓ మహిళకు లాటరీ తగిలిందని చెప్పి ఊరి బయటకు తీసుకెళ్లి ఆమె మెడలో ఉండే బంగారు గొలుసు తీసుకొని పారిపోయిన ఘటన నిర్మల్( Nirmal ) జిల్లా కుంటాల మండలం కల్లూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది.అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.

వివరాల్లోకెళితే.కల్లూరు గ్రామానికి( Kallur village ) బైక్ పై ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ పెంట పెద్దమ్మ ఇల్లు ఎక్కడ ఉందని ఓ మహిళను అడిగాడు.తానే పెంట పెద్దమ్మ అని ఆ మహిళ అనడంతో మీరు ఈ మధ్య జియో నెట్వర్క్( Jio Network ) నుండి ఎయిర్టెల్ నెట్వర్క్ ( Airtel Network )మారారా అని అడిగాడు.ఆ మహిళ అవును అని చెప్పడంతో నెట్వర్క్ మారినందుకు లక్కీ లాటరీ తగిలిందని మీరు రెండు తులాల బంగారం గెలుచుకున్నాడని చెప్పాడు.
ఆ వ్యక్తి చెప్పిన మాటలకు ఆమె ఎంతో సంతోషపడి.ఆ బంగారం పొందాలంటే ఏం చేయాలని అడిగింది.ఏమీ లేదు రూ.10 ఇస్తే సరిపోతుంది అన్నాడు.దీంతో ఆ మహిళ ఇంట్లోకి వెళ్లి రూ.110 తెచ్చి ఇచ్చింది.ఆ డబ్బులు తీసుకున్న సదరు వ్యక్తి మెయిన్ రోడ్డు వద్ద తమ లాటరీ ఆఫీసర్లు ఉన్నారని తనతో పాటు వస్తే బంగారం ఇప్పిస్తానని చెప్పాడు.

అందుకు ఆ మహిళ సరే అని చెప్పి ఆ వ్యక్తి బైక్ పై వెళ్ళింది.ఆ వ్యక్తి ఊరి చివర ఉండే 61వ నెంబర్ జాతీయ రహదారి వద్ద ఉండే వాసవి కళాశాల వద్ద బైక్ ఆపాడు.ఆ సమీపంలోని బైక్ షో రూమ్ ( Bike Show Room )లోకి వెళ్లి కాసేపటికి బయటకు వచ్చి మెడలో ఉండే రెండు తులాల గొలుసు ఇవ్వమని అడిగాడు.
ఆ మహిళ ఎందుకు అని అడగకుండా ఆ గొలుసు తీసి ఆ వ్యక్తి చేతిలో పెట్టింది.మీరు ఇక్కడే ఉండండి నేను బంగారం గొలుసు తూకం వేసుకొని వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఎంతసేపైనా ఆ వ్యక్తి తిరిగి రాకపోవడంతో ఆ మహిళ షో రూమ్ లోకి వెళ్లి అడిగితే అతను ఎవరో తమకు తెలియదని షోరూం సిబ్బంది చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించింది.వెంటనే ఆలస్యం చేయకుండా కుంటాల పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు సిసిటీవీ దృశ్యాలను పరిశీలించగా నిందితుడు బైక్ పై మహిళను తీసుకువెళ్లడం స్పష్టంగా రికార్డు అయింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.








