తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం ససేమిరా అందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.సీఎం కేసీఆర్ సహా మంత్రివర్గం ఢిల్లీలో దీక్ష చేసినా దిగిరాలేదని విమర్శించారు.
దేశంలో మూడేళ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్రం చెప్పిందన్నారు.ఆరు నెలలు కూడా తిరగకుండానే దేశంలో బియ్యం కొరత అంటున్నారని మండిపడ్డారు.
కేంద్రం గతంలో చెప్పినట్లు ధాన్యం నిల్వలు ఉంటే బియ్యం కొరత ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.వ్యవసాయం పట్ల కేంద్రానికి ఒక విధానం అంటూ ఏమీ లేదని విమర్శలు చేశారు.
ప్రకృతి విపత్తులు వస్తే కేంద్రం పంట నష్టం పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు.అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రూ.151 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు.ఇంకా మిగిలిన వారికి కూడా సాయం అందిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
అదేవిధంగా వ్యవసాయ రంగంలో బీమా కోసం కేంద్రం చొరవ తీసుకోవాలని ఆయన కోరారు.తెలంగాణలో రైతులకు ప్రయోజనం కలిగించే ఒక కొత్త భీమా పథకాన్ని అమలులోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోందని వెల్లడించారు.







