సూర్యాపేట జిల్లా:ఇటీవల కురిసిన వర్షాలకు అనంతగిరి మండలంలోని పాలేరు( paleru ) వాగు పరివాహక ప్రాంతాలైన చనుపల్లి, పాలవరం,మొగలాయికోట,శాంతినగర్,గొండ్రియాల, కొత్తగూడెం గ్రామాలు చిగురుటాకులా వణికిపోయాయి.ఆయా గ్రామాల్లో ప్రభుత్వం నిర్మించిన వైకుంఠ ధామాలు,డంపింగ్ యార్డ్ లు వరద తాకిడికి తీవ్రంగా నష్టపోయి,భారీ నష్టం జరిగిందని ఆయా గ్రామాల సర్పంచ్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చనుపల్లిలో నిర్మించిన డంపింగ్ యార్డ్ వరదలో కొట్టుకుపోయి,రూ.2.60 లక్షల నష్టం వాటిల్లిందని, కిష్టాపురం గ్రామంలో వైకుంఠధామానికి వెళ్లే రోడ్డు మొత్తం మట్టి కొట్టుకుపోయిందని రెండు గ్రామాల సర్పంచ్ లు గోడు వెళ్లబోసుకున్నారు.పాలేరు వాగు ఉదృతి వల్ల ఈ ప్రాంతంలో పంటలకు ఎంత నష్టం వాటిల్లిందనే విషయంలో సంబంధిత అధికారులు శీతకన్ను వేస్తున్నారని,కనీసం పర్యవేక్షణ చేయకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
వరద ప్రవాహానికి పంట పొలాలకు లక్షల్లో నష్టం వాటిల్లిందని,వ్యవసాయ అధికారులు పంట నష్టాల గురించి క్షేత్రస్థాయిలో పరిశీలించకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి పాలేరు వాగు పరివాహక ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నారు.







