ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు( Kalvakuntla Chandrasekhara Rao ) తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని టీయూడబ్ల్యూజే (ఐజేయు) యూనియన్ జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు( Kola Nageswara Rao ) కోరారు.శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలో యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై సీఎం కేసీఆర్ కు పోస్టు కార్డు ఉద్యమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిది ఏళ్లుగా జర్నలిస్టులను మోసం చేస్తుందన్నారు.గతంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయడం లేదని విమర్శించారు.
జిల్లాలో ఒక్క హుజూర్ నగర్ లో తప్ప మిగతా 22 మండలాలలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లాలోని అన్ని మండలాలలో పనిచేస్తున్న అర్హత కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి గృహలక్ష్మి పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని,రాష్ట్రంలోని అన్ని కార్పొరేటు వైద్యశాలలో ఆ హెల్త్ కార్డులు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రైవేటు పాఠశాలలు,కళాశాలలో జర్నలిస్టుల పిల్లలకు విద్యాబోధనలో 50% రాయితీ ఇవ్వాలని కోరారు.
జర్నలిస్టుల సమస్యలకు సంబంధించి హామీలు అమలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులకు రైల్వే ప్రయాణంలో 50 శాతం సబ్సిడీపై పాసులు ఇవ్వాలని,గతంలో ఇచ్చిన రైల్వే పాసులను వెంటనే పునర్ధరించాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా అణచివేతకు గురి చేస్తున్నారని ఆరోపించారు.తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన జర్నలిస్టులను నిర్లక్ష్యం చేయడం సరైన విధానం కాదన్నారు.
సీమాంధ్ర పాలనలో అన్యాయం జరిగిందని తెలంగాణ కోసం పోరాడితే ఇక్కడ కూడా సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి పథకాలు అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, జర్నలిస్టులు దేనమకొండ శేషంరాజు,దేవరం రామ్ రెడ్డి,బసవోజు శ్రీనివాస చారి,బోనాల నాగేశ్వరరావు,కోమరాజు అంజయ్య,ఇందిరాల రామకృష్ణ,ఇట్టిమల్ల రామకృష్ణ,అమరవాది సత్య సాయికుమార్, సిహెచ్.రమేష్,గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు
.