2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు( US Presidential Elections 2024 ) సంబంధించి అప్పుడే అమెరికాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఆశావహులంతా అధ్యక్ష బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్,( Joe Biden ) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు( Donald Trump ) ఇప్పటికే తాము అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.వీరితో పాటు డెమొక్రాటిక్, రిపబ్లిక్ పార్టీలలో వున్న కొందరు ప్రముఖులు కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా.
ఇంకొందరు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు.రిపబ్లికన్ పార్టీలో కీలక నేతగా వున్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్( Ron DeSantis ) కూడా అధ్యక్ష బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
అందరూ అనుకున్నట్లుగానే రిపబ్లికన్‌లలో ట్రంప్ కంటే డిసాంటిస్‌కు ప్రజల ఆమోదం ఎక్కువగా వున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

అమెరికాలో వేసవి మాదిరిగానే అక్కడి రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి.రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీ తీవ్రమవుతున్నందున వైట్‌హౌస్‌లో అడుగుపెట్టాలని భావిస్తున్న ఆశావహులు వచ్చే ఏడాది ప్రారంభంలో నామినేషన్ ప్రక్రియను ఆరంభించే రాష్ట్రాలైన అయోవా, న్యూ హాంప్‌షైర్‌లలో ఈవెంట్లకు ప్లాన్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ ఈ శనివారం నాష్‌విల్లే మ్యూజిక్ సిటీ సెంటర్‌లో రిపబ్లికన్ పార్టీకి నమ్మకస్తులైన 1500 మందిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఇది జరిగిన కొన్ని వారాల తర్వాత డోనాల్డ్ ట్రంప్ అలబామా గుండా మరో పెద్ద ఈవెంట్‌కు హాజరవుతారు.ఇప్పటికే ట్రంప్, డిసాంటిస్‌లు గత నెలలో అయోవా, న్యూహాంప్‌షైర్, సౌత్ కరోలినాలో ర్యాలీలు నిర్వహించారు.
అయితే సూపర్ ట్యూస్‌డే రోజున టెన్నెస్సీ,( Tennessee ) అలబామా( Alabama ) వంటి రాష్ట్రాల్లో తమ పట్టు పెంచుకునేందుకు వీరిద్దరూ రిపబ్లికన్ పార్టీలోని తమ ప్రత్యర్ధులకు మించి ప్రణాళికలు రచిస్తున్నారు.

అయోవా, న్యూహాంప్‌షైర్ వంటి ప్రారంభ రాష్ట్రాల్లో పోటీ త్వరగా జరుగుతుంది.కాలిఫోర్నియా, టెక్సాస్, మసాచుసెట్స్, మైనే వరకు విస్తృత భౌగోళిక ప్రాంతంలో దాదాపు 14 ప్రైమరీల సెట్ నిర్వహిస్తారు.2016లో ట్రంప్, 2020లో బైడెన్‌లు సూపర్ ట్యూస్‌డేలలో ఆధిపత్యం ప్రదర్శించారు.ప్రస్తుతం రిపబ్లికన్ నేతల్లో ట్రంప్ ముందంజలో వుండగా, డిసాంటిస్ ఆయన తర్వాతి స్థానంలో నిలిచారు.వీరితో పాటు మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్, సౌత్ కరోలినా సెనేటర్ టిమ్ స్కాట్, మాజీ ఐక్యరాజ్యసమితి రాయబారి నిక్కీ హేలీ, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, ఇండో అమెరికన్ బిలియనీర్ వివేక్ రామస్వామిలు ఆ పార్టీ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
ట్రంప్, డిసాంటిస్‌లకు విస్తృత ప్రచారం చేయడానికి నిధులు వున్నాయి.ఈ ఏడాది రెండో త్రైమాసికంలోనే ట్రంప్ 35 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేస్తారని ఆయన ప్రచార బృందం తెలిపింది.
అయితే డిసాంటిస్ తన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించిన ఆరు వారాల్లోనే ఏకంగా 20 మిలియన్ డాలర్లు సేకరించడం గమనార్హం.







