సులభంగా డబ్బు సంపాదించడానికి మనలో చాలా మంది అనుసరించే మార్గాల్లో లాటరీ ఒకటి.ఏళ్లుగా లాటరీ టికెట్లు కొన్నా అదృష్టం కలగనివారు కొందరైతే, ఫస్ట్ అటెంప్ట్‌లోనే కోటీశ్వరులైన వారు ఇంకొందరు.
ఒకవేళ లాటరీ తగిలితే ఆ డబ్బుతో ఏం చేయాలో కూడా ముందే లెక్కలు రాసుకుంటారు.అలాంటిది లాటరీలో గెలిచిన సొమ్మును ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన వారి కోసం విరాళంగా ప్రకటించాడో ఎన్ఆర్ఐ.
వివరాల్లోకి వెళితే.యూఏఈలోని( UAE ) అబుదాబిలో జరిగిన డ్రాలో 20 వేల దిర్హామ్‌లు (భారత కరెన్సీలో రూ.4,48,885) గెలుచుకున్నారు 28 ఏళ్ల ప్రవాస భారతీయుడు.అయితే ఆ సొమ్మును తన సొంతానికి వాడుకుకోకుండా జూన్ 2న ఒడిషాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద బాధితులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకుని తన పెద్ద మనసును చాటుకున్నారు.
ఒడిషాలోని జస్పూర్ పట్టణానికి చెందిన సహజన్ మొహమ్మద్( Sahajan Mohd ) అబుదాబిలోని ఓ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తూ నెలకు 2000 దిర్హామ్‌ల వరకు సంపాదిస్తున్నాడని ఖలీజ్ టైమ్స్ నివేదించింది.లాటరీపై మక్కువ చూపే సహజన్.
గత కొన్నేళ్లుగా రాఫిల్ డ్రాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేవాడు.ఈ క్రమంలో జూన్ 7న డ్రీమ్ ఐలాండ్ స్క్రాచ్ కార్డ్ గేమ్ ఆడి బహుమతిని గెలుచుకున్నాడు.

ఈ క్రమంలో అదే వారంలో ఒడిషాలోని బాలాసోర్ జిల్లాలో( Balasore district of Odisha ) మూడు రైలు ఢీకొట్టుకున్న ఘటన గురించి తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు మొహమ్మద్.ఈ దుర్ఘటనలో బాధితులుగా మారిన తన గ్రామంలోని ప్రజలకు అండగా నిలబడాలని ఆయన నిర్ణయించుకున్నారు.ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరు తన స్వగ్రామానికి చెందినవారు వున్నారని సహజన్ చెప్పాడు.

కాగా.జూన్ 2న బాలాసోర్‌లో హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్‌లోకి దూసుకెళ్లి ఆగివున్న గూడ్స్‌ను ఢీకొట్టింది.ఈ ఘటనలో కోరమండల్‌కు చెందిన కొన్ని బోగీలు ఎగిరి పక్క ట్రాక్‌పై పడ్డాయి.
సరిగ్గా అదే సమయంలో బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఆ బోగీలను ఢీకొట్టడంతో పెను ప్రమాదం సంభవించింది.ఈ దుర్ఘటనలో 288 మంది ప్రాణాలు కోల్పోగా.1000 మంది వరకు గాయపడ్డారు.గడిచిన కొన్నేళ్లలో భారతదేశంలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదంగా బాలాసోర్ దుర్ఘటన నిలిచింది.
అయితే ప్రమాదం వెనుక కుట్ర కోణం వుందన్న అనుమానాల నేపథ్యంలో రైల్వే శాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది.







