కళలకు, గొప్ప సంస్కృతికి, ప్రకృతి వనరులకు, అపార సంపదకు పుట్టినిల్లు భారతదేశం.అందుకే అనాదిగా ఈ రత్న గర్భ విదేశీ దండయాత్రలను ఎదుర్కొంది.
నాటి అలెగ్జాండర్ నుంచి ఆంగ్లేయుల వరకు భారతదేశాన్ని కొల్లగొట్టిన వారే.దేశాన్ని చెప్పు చేతల్లోకి తీసుకోవడంతో పాటు ఇక్కడి సంపదను వారి స్వదేశాలకు తరలించుకుపోయారు.
వాటిలో కోహినూర్ వజ్రం( Koh-i-Noor ), నెమలి సింహాసనం తో పాటు ఎన్నో కళాఖండాలు, ముత్యాలు, పగడాలు, వజ్ర వైడూర్యాలు వున్నాయి.ఇక స్వాతంత్ర్యం వచ్చాకా స్వదేశంలోని దొంగల వల్ల మనదేశ సంపద ఖండాలు దాటుతోంది.
కోట్లాది రూపాయల డబ్బుకు ఆశపడి కొందరు భారతీయులే దేవాలయాల్లోని సంపదను కొల్లగొట్టి విదేశాలకు విక్రయిస్తున్నారు.అలా భారతీయ సంపద.
విదేశాల్లోని ఆర్ట్ గ్యాలరీల్లో, మ్యూజియాల్లో మగ్గుతోంది.అయితే కొందరి కృషి వల్ల అలాంటి అపురూప సంపద తిరిగి భారతదేశానికి చేరుకుంటోంది.

కాగా.ప్రధాని నరేంద్ర మోడీ( Narendra Modi ) పగ్గాలు చేపట్టిన 9 ఏళ్లలో చోరీకి గురైన 231 కళాఖండాలు, అరుదైన వస్తువులు తిరిగి భారత్‌కు చేరుకున్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2014 వరకు గత ప్రభుత్వాలు విదేశాల నుంచి కేవలం అమూల్యమైన 13 పురాతన వస్తువులను మాత్రమే తీసుకొచ్చాయని ఆయన చెప్పారు.2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 231 వస్తువులను వెనక్కి తీసుకొచ్చామని.ఇలాంటి ఎన్నో పురాతన వస్తువులను తీసుకువచ్చే ప్రక్రియ వేగంగా జరుగుతోందని జితేంద్ర సింగ్ తెలిపారు.

న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన మూడు రోజుల ‘‘ ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్‌పో 2023’’ని ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఎన్నో విశిష్ట కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.
దేశంలో సైన్స్ మ్యూజియంలను ఏర్పాటు చేయడం వీటిలో ఒకటని ఆయన పేర్కొన్నారు.కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలోని బయో టెక్నాలజీ విభాగం ద్వారా ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్( Himachal Pradesh )లోని చంబాలో మ్యూజియంలను ఏర్పాటు చేశామని చెప్పారు.
కేరళలోని వాయ్‌నాడ్, ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్ధనగర్, హర్యానాలోని నుహ్, రాజస్థాన్‌లోని ధోల్‌పూర్, కర్ణాటకలోని రాయచూర్, పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణిలలో మ్యూజియంలను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు జితేంద్ర సింగ్ వెల్లడించారు.







